జూబ్లిహిల్స్‌లో ఉన్న ఓ ప్రముఖ చానల్ ఆఫీసుకు ముంబై నుంచి పోలీసులు వచ్చారు. వారి ఉద్దేశం ఆ చానల్ ఓనర్ని అరెస్ట్ చేయడమే. అయితే ఎందుకొచ్చారో.. కేసేమిటో ఆయనకు తెలుసు. ఇంకెవరికీ తెలియదు. కానీ ముంబై పోలీసులు వచ్చిన విషయం.. ఓనర్‌ను పట్టుకుపోవాల్సిందేనని భీష్మించుకున్న వైనంపై.. సమాచారం అందుకున్న వారెవరో… పోలీసులు ముంబై నుంచి వచ్చారు కాబట్టి.. అది టీఆర్పీ కేసే అయి ఉంటుందని.. ఆ కేసులో ఆ టీవీ చానల్ ఓనర్ని అరెస్ట్ చేశారని పుకారు పుట్టించారు. దాంతో క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆయన చానల్ ఓ పార్టీకి కొమ్ము కాస్తూ.. ఇతర పార్టీలపై నిందలు వేయడం చేస్తూండటంతో.. ఆ ఇతర పార్టీల కార్యకర్తలు ఆయనను అరెస్ట్ చేశారని వైరల్ చేసి పడేశారు.
నిజానికి అది టీఆర్పీ కేసు కాదు. కానీ కక్కుర్తి కేసు. ఒకానొక సమయంలో… ఓ మాజీ హీరోయిన్ చేసిన ప్రోగ్రామ్స్‌ను ఆయన తన చానల్ కోసం వాడుకున్నారు. రెండేళ్ల అగ్రిమెంట్ కుదుర్చుకుని ప్రసారం చేసుకున్నారు. రెండేళ్లు అయిపోయిన తర్వాత మళ్లీ మాజీ హీరోయిన్ పర్మిషన్ తీసుకోవడం.. లైసెన్స్ పునరుద్ధరించుకోవడం లాంటివేమీ చేయకుండా ఆమె కంటెంట్ వాడేసుకున్నారు. ఇది తెలిసి.. సాక్ష్యాలతో సహా ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు… ఇక్కడ టీవీ చానల్ ఓనర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి వారెంట్ పట్టుకుని వచ్చారు. జరిగింది ఇది.
నిజానికి ఆ కంటెంట్ వాడుతున్నారా లేదా.. దానికి లైసెన్స్ ఉందా లేదా లాంటివి చూసుకునే తీరిక ఆ టీవీచానల్ ఓనర్‌కి లేదు. ఆయా చానల్ వ్యవహారాలు చూసేవారు దానికి బాధ్యత వహించాలి. కానీ వారి అనాలోచిత వ్యవహారం వల్ల మొత్తానికి ఆ టీవీ చానల్ ఓనర్ మెడకు చుట్టుకుంది. నేరుగా వారెంట్లతో వచ్చే సరికి ఏం చేయాలో తెలియక బిక్కు బిక్కుమంటూ గడిపాడు. అదే సమయంలో తనపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగంతో కంగారుపడిపోయారు.చివరికి అరెస్ట్ బాధ నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆయనకు ఆ బాధ కంటే… తనపై జరిగిన ప్రచారమే ఎక్కువ బాధపెడుతోంది. అందుకే తనపై తప్పుడు ప్రచాంరం చేశారంటూ.. సోషల్ మీడియాపై ఫిర్యాదులు చేసుకున్నారు. కానీ నిజం ఎప్పుడూ దాగదుగా.. ఆయనపై నమోదైన కేసు వివరాలు సహా మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.