మీడియా సంస్థలను టార్గెట్ చేసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు… అల్టిమేట్ షాక్ ఇవ్వాలని తెలుగు టీవీ చానళ్లు నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు టీవీచానళ్ల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుందని.. పవన్ కల్యాణ్ కు హెచ్చరిక లాంటి.. సూచన పంపి.. ఆ తర్వాత నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ , జనసేన వ్యవహారాలు తమ చానళ్లలో రావని.. ఎవరూ బహిరంగంగా చెప్పరు కానీ.. తమ ఎడిటోరియల్ పాలసీలో భాగంగా.. వాటిని తమ చానళ్లలో రాకుండా… కట్టడి చేస్తారని సమాచారం
శ్రీరెడ్డి అనే నటీమణి ప్రారంభించిన చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారి.. పవన్ కల్యాణ్‌ను చుట్టుముట్టింది. ఓ అసభ్యకర పదాన్ని పవన్ ను ఉద్దేశించి శ్రీరెడ్డి అనింది. ఈ విషయాన్ని జనసేన అధినేత సీరియస్ గా తీసుకున్నారు. ఈ తతంగానికంతటికి మీడియా చానళ్లే కారణమని.. ఆరోపణలు ప్రారంభించారు. తనపై ఆరోపణలు చేసిన వారితో గంటల కొద్దీ డిస్కషన్లు పెట్టమేమిటని.. పబ్లిసిటీ కోసం తనపై నిందలేస్తున్నా.. టీఆర్పీల కోసం ప్రొత్సహించడం ఏమిటని పవన్ కల్యాణ్ అభ్యంతరం. అయితే దీన్ని ఎక్స్ ప్రెస్ వ్యూహంలో పవన్ కల్యాణ్ దూకుడుగా వెళ్లారు. టీవీ చానళ్ల యజమానులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. ట్వీట్టర్ లో అనేక ఆరోపణలు చేస్తూ.. బెదిరిస్తున్నట్లుగా ట్వీట్లు పెడుతున్నారు. తన అభిమానులు.. ఓ మీడియా సంస్థ వాహనాలను ధ్వంసం చేయడాన్ని కూడా పవన్ ఖండించలేదు. దాంతో టీవీ చానళ్ల సంఘం కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంది.
మీడియా లేకపోతే.. రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదని… కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటించి.. చెప్పారు పవన్ కల్యాణ్. ఇప్పుడు తాను ఓ రాజకీయ పార్టీ అధినేతగా మారి ఆ మీడియానే దూరం చేసుకోవాలని అనుకుంటున్నారు. జనసేన కార్యక్రమాలకు మీడియా ముందు నుంచి మంచి మద్దతు లభించింది. టీఆర్పీల కోసమే అయినా…. అది జనసేనకు ఎంతో కొంత క్రేజ్ రావడానికి ఉపయోపడింది. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ తన సహజసిద్ధమైన ఆవేశంతో ఆ అడ్వాంటేజ్ ను దూరం చేసుకుంటున్నారు.
పవన్ కల్యాణ్… ఇప్పుడైనా.. మీడియా సంస్థలతో బహిరంగంగా కాకపోయినా.. అంతర్గతంగా రాజీ ప్రయత్నాలు చేసుకుంటే… మంచిదని చాలా మంది జనసైనికులు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా పవన్ కు ఎంత కవరేజీ ఇచ్చినా.. అది.. కేవలం జగన్ కు ఎంత ఉపయోగపడుతుందో అంత మేరకే ఇస్తారు. పవనకు ఉపయోగపడేలా ఇవ్వరు. సొంత మీడియాను అభివృద్ధి చేసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే పవన్… మనసు మార్చుకోవాలని… మీడియాతో యుద్ధాన్ని ఆపేయాలని కోరుకుంటున్నవారిలో ఆయన ఫ్యాన్సే ఎక్కువ మంది ఉన్నారు.