ఈరోజు పవన్ కళ్యాణ్ సారధ్యంలో జనసేన పార్టీ ప్రత్యేక హోదా సాధన మరియు విభజన హామీల అమలుపై జనసేన నిరసన కవాతు చేపట్టింది. ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఈ సభ సుమారుగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రారంభమైంది అయితే జనసేన నిరసన కవాతు ని కవర్ చేసే విషయంలో టీవీ చానల్స్ చూపించిన అతి తెలివితేటలు పరిశీలకులని నివ్వెర పర్చాయి.
నేపథ్యం:
వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ టీవీ చానెళ్లతో గొడవ పెట్టుకున్న దరిమిలా పవన్ కళ్యాణ్ వార్తలను కానీ, సభలను కానీ, స్పీచ్ లను కానీ, కవర్ చేయడం ప్రధాన చానళ్లన్నీ దాదాపుగా మానేశాయి. పవన్ కళ్యాణ్ టీవీ9, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ ఛానళ్లని లక్ష్యంగా చేసుకుని ఆ మధ్య విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే అయితే ఇందులో టీవీ9పై ప్రధానంగా గురిపెట్టి అధికార తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై తనను, తన తల్లిని కించపరిచారని అందుకోసమై 10 కోట్ల వరకు డబ్బులు చేతులు మారాయని పవన్ కళ్యాణ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వార్తలు కవర్ చేసే విషయంలో ఈ ప్రధాన చానళ్లన్నీ తమ పంథా మార్చుకున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన మొదలు పెట్టిన రోజు మాత్రం అన్ని ఛానళ్లు లైవ్ కవరేజ్ ఇచ్చాయి- బహుశా ఆ రోజు ప్రజలంతా నిశితంగా పరిశీలిస్తారని భావించి ఉండవచ్చు. అయితే ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కవరేజ్ తగ్గిస్తూ అసలు పవన్ కళ్యాణ్ ఏ ప్రాంతంలో పర్యటన చేస్తున్నారో కూడా తెలియనంతగా కవరేజ్ తగ్గించాయి. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని జనసేన వార్తలు తెలుసుకోవాలనుకునే వాళ్లకు యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, వాట్సప్ ద్వారా వార్తలు చేరుతూనే ఉన్నాయి, అది వేరే విషయం. కానీ సాధారణ ప్రజలకి పవన్ కళ్యాణ్ వార్తలు అందకుండా చేయడం లో ఛానల్ లు విజయం సాధించాయనే చెప్పాలి.
టీవీ ఛానెళ్ల (అతి) తెలివితేటలు:
అయితే ఇక్కడ పరిశీలకులను నివ్వెరపరిచిన విషయం ఏంటంటే, ఆయా ఛానల్ లు తమ చానల్లో పవన్ కళ్యాణ్ నిరసన లని, పవన్ కళ్యాణ్ సభలని ఏ మాత్రము చూపించకపోయినప్పటికీ ఆయా చానళ్లకు సంబంధించిన యూట్యూబ్ చానల్స్ లో మాత్రం జనసేన సభలకు, ఇవాళ జరిగిన జనసేన నిరసన కవాతు కి లైవ్ కవరేజ్ అందించాయి. నిజంగా ఆయా ఛానల్ లు పవన్ కళ్యాణ్ ని బహిష్కరించాలి అనుకున్నప్పుడు యూట్యూబ్లో మాత్రం ఎందుకని ప్రసారం చేయడం అన్నది పరిశీలకులకు అర్థం కాలేదు. AP24X7 ఛానెల్ మాత్రం ఇందుకు మినహాయింపు. మిగతా ఛానల్స్ మాత్రం తమ కవరేజ్ ని కేవలం యూట్యూబ్ కి పరిమితం చేసాయి. మహా టీవీ, 10 టీవీలు మధ్య మధ్యలో “ఇవ్వలేదు” అనకుండా అన్నట్టు రెండంటే, రెండే నిముషాలు కవరేజ్ ఇచ్చాయి.
ఆయా ఛానెళ్ళు యూట్యూబ్ లో మాత్రం లైవ్ ఇచ్చిన స్క్రీన్ షాట్స్ క్రింద చూడవచ్చు.
ఏదిఏమైనా చానళ్ళు కవర్ చేయకపోయినప్పటికీ, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న విషయాలు రాష్ట్రమంతా తెలియకపోయినప్పటికీ, ఏ నియోజకవర్గంలో అయితే పర్యటన చేస్తున్నాడో, అక్కడ మాత్రం ప్రజలకి వెళ్లవలసిన సమాచారం వెళ్లకుండా ఉండదు. అయితే ఆ సభలకు హాజరవుతున్న లక్షలాదిమంది కి కూడా, ఇంతమంది వచ్చినా, ఈ సభను ఎందుకు ఛానెళ్ళు కవర్ చేయలేదు అన్న సందేహం రాక మానదు.
ముగింపు:
బోయపాటి శ్రీను ఒక సినిమాలో డైలాగు రాశాడు – “ఈ రాష్ట్రంలో ఒక పిచ్చి కుక్క ఎవరినైనా కరిచినా రోజంతా స్క్రోలింగ్ వేసి మరీ చూపించే ఛానెళ్ళు ఒక విషయాన్ని అందరూ కట్టగట్టుకుని చూపించట్లేదు అంటే అందుకు కారణం అర్థం కాలేదా” అంటూ ఒక డైలాగ్ రాశాడు. లక్షమంది లేదంటే , కనీసం కొన్నివేల మందు ఒక సభకు హాజరైనప్పుడు ఆ సభ గురించిన ప్రాథమిక సమాచారం కానీ సభ గురించిన వివరాలు కానీ ఏ మాత్రము చూపించకుండా ఛానెళ్ళు వ్యవహరించినప్పుడు, దాని వెనుక కారణాలు అర్థం చేసుకోలేనంత అమాయకంగా అయితే ఇప్పటి ప్రజలు లేరు.
-జురాన్