ఈ వేసవి ఒక్కసారిగా చప్పగా మారిపోయింది. కొత్త సినిమాలపై దృష్టి పెట్టే ఛాన్సు లేదు. ఐపీఎల్లో మునిగి తేలే అవకాశం లేదు. సరదాగా టూర్లు, షికార్లు చేద్దామన్న ఆలోచన లేదు. అంతా కరోనా.. భయమే. పిల్లలు, పెద్దలు ఇంటి పట్టున ఉండడానికి ఓ అవకాశం లభించిందనుకోవాలంతే. దీన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి టీవీ ఛానళ్లు.
భారీ రేట్లు పెట్టి సినిమా శాటిలైట్ హక్కులు కొనడం, తీరా చూస్తే.. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో టీవీ ఛానళ్లు తీవ్ర నష్టాల బాట పట్టాయి. ఓటీటీ వేదికలు వచ్చాక… టీవీలో సినిమా రావాలి, అది మేం చూడాలి – అన్న ధ్యాస పూర్తిగా తగ్గిపోయింది. వెబ్ సిరీస్ల దూకుడు కూడా… సినిమాలకు గట్టి కళ్లమే వేసింది. దాంతో టీఆర్పీ రేటింగులు భారీగా పడిపోయాయి. న్యూస్ ఛానళ్లకు తప్ప, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లకు టీఆర్పీ రేటింగులు ఏమాత్రం దక్కడం లేదు. ఇప్పుడు వాళ్లకు ఓ మంచి ఛాన్స్. ఈమధ్య కొత్తగా విడుదలైన సినిమాల్ని టీవీలో ప్రదర్శించుకుని, రేటింగులు పెంచుకోవడానికి ఇదో అవకాశం. అందుకే కొత్త – పాత సినిమాల బూజు దులుపుతున్నాయి టీవీ ఛానళ్లు. ఎక్కువ రేట్లు పెట్టి కొని, తక్కువ టీఆర్పీలు దక్కించుకున్న సినిమాలు కొన్నింటిని ఈ సీజన్లో విరివిగా ప్రదర్శించాలని కొన్ని టీవీ ఛానళ్లు నిర్ణయానికి వచ్చాయి. సినిమా – ఐపీఎల్ రెండూ లేవు కాబట్టి… జనాలంతా ఇంటి పట్టునే ఉంటారు. వాళ్లకు టీవీతప్ప మరో వినోద మాధ్యమం లేదు. సో… ఇదే మంచి ఛాన్సు.