ఏం బాస్… అంతా ఓకేనా? టీవీ5 డెస్కులో ఈ మాటతో మొదలయ్యేది అరుణ్ సాగర్ దినచర్య. ఎప్పుడూ ముఖాన చిరునవ్వే ఆయనకు ఆభరణంగా ఉండేది. అలాంటి వ్యక్తి హటాత్తుగా ఈ లోకాన్ని వీడిపోయారంటే పాత్రికేయులు నమ్మలేకపోయారు. ఎంతో మంది కంటతడిపెట్టారు. దాదాపు పాతికేళ్ల పాత్రికేయ ప్రస్థానంలో ఆయన వల్ల స్ఫూర్తిని పొందిన వారు ఎందరు అంటే, లెక్కించి చెప్పడం కష్టం.
ఖమ్మం జిల్లాలో రాముడి పుణ్యక్షేత్రం ఉన్న భద్రాచలం వాస్తవ్యుడైన అరుణ్ సాగర్, తన తోటి సిబ్బందికి చల్లని రామయ్య వంటి వాడే. సుప్రభాతం పత్రిక ద్వారా జర్నలిజం కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత టీవీ9లో చేరారు. ఆ చానల్ ను అగ్ర పథాన నిలపడానికి కారకులైన కీలక వ్యక్తులోల ఆయన ఒకరు. అటు తర్వాత, 10 టీవీ ఆరంభం నుంచీ సి.ఇ.ఒ.గా చానల్ ను ఓ స్థాయికి తీసుకు వచ్చారు. పోటీ చానల్స్ ఎన్ని ఉన్నా 10 టీవీకి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఏడాదిన్నర క్రితం టీవీ 5 ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ చానల్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దడానికి కృష్టి చేశారు.
అరుణ్ సాగర్ లో ఓ జర్నలిస్టే కాదు, ఓ స్వాప్నికుడు కనిపించే వాడు. పీడిత తాడిత ప్రజల పట్ల తపన పడే సామాజిక వేత్త కనిపించే వాడు. గిరిజనులంటే ఆయనకు ఎనలేని మమకారం. భద్రాచలం చుట్టూ అడవులు, ఆదివాసీలే. కాబట్టే ఆయనకు ఆదివాసులంటే ఆప్యాయత పెరిగి ఉంటుంది. పోలవరం ముంపు బాధితులు, ఆదివాసీల భవిష్యత్తుపై ఆయన రాసిన పుస్తకావిష్కరణ రెండు నెలల క్రితమే జరిగింది.
అరుణ్ సాగర్ జర్నిస్లుగానే కాదు, కవిగానూ చాలా మంది సుపరిచితుడు. రచయితగా తన ప్రస్థానంలో వెయ్యికి పైగా కవితలు రాశారు. కవితా సంకలనాల ద్వారా సంచలనం సృష్టించారు. పదునైన భాషతో, స్పష్టమైన భావాలతో పలు పత్రికల్లో సమకాలీన అంశాలపై వ్యాసాలు రాశారు.
టీవీ5 ఆఫీసులో ఆయన ఉన్నారంటే సిబ్బందికి ఓ స్ఫూర్తి. ఒక ధైర్యం. ఒక భరోసా. ఎంతటి సంచలనమైన బ్రేకింగ్ న్యూస్ వచ్చినా, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే అనుమానం డెస్కు సిబ్బందికి వచ్చినా వెంటనే వారిమధ్యలో కూర్చుని సూచనలు ఇవ్వడం ఆయన ప్రత్యేకత. చన చాంబర్ లో కంటే డెస్కులోనే ఎక్కువ సేపు కనిపించే ఎడిటర్లు చాలా అరుదు. అలాంటి అరుదైన సంపాదకుడే అరుణ్ సాగర్. అలాంటి బహుముఖ ప్రతిభాశాతి, 49 ఏళ్ల చిన్న వయసులోనే తన జీవన మహా ప్రస్థానాన్ని ముగించారు. ఫిల్మ్ నగర్ లోని మహా ప్రస్థానం వాటికలో ఆయన భౌతికకాయానిక అంత్యక్రియలు జరిగాయి. అరుణ్ సాగర్ మరణంతో, తెలుగు పాత్రికేయ కుటుంబం ఓ ఆప్తుడిని, సమర్థుడిని, అన్నింటికీ మించి మంచి మనీషిని కోల్పోయింది.