టీవీ5 జర్నలిస్ట్ మూర్తి మళ్లీ శుక్రవారం రాత్రి స్క్రీన్ పైకి వచ్చారు. ఆయనను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారంటూ.. జరిగిన హడావుడితో రెండు రోజుల పాటు ఆయన స్క్రీన్ పైకి రాలేదు. దాంతో ఆయనను అరెస్ట్ చేశారని కొంత మంది… పరారయ్యాడని మరికొంత మంది ప్రచారం చేయడం ప్రారంభించారు. ఏది నిజమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో.. శుక్రవారం రాత్రి చర్చా కార్యక్రమాన్ని మూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా తనపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తనపై ఎక్కడా కేసులు నమోదు కాలేదని.. ఎక్కడా ఎఫ్ఐఆర్ లేదని స్పష్టం చేశారు. అయితే.. తన అరెస్ట్‌కు ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని మూర్తి చెప్పకనే చెప్పారు.
తనకు ఉన్న న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు .. హితులు,శ్రేయోభిలాషుల సలహాల మేరకు..తన ప్రయత్నాలు తాను చేశానన్నారు. అందుకే రెండు రోజులు స్క్రీన్ పైకి రాలేదన్నారు. అదే సమయంలో… ఎప్పుడూ చెప్పే మాటల్నే చెప్పారు. తనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రశ్నించే హక్కున జర్నలిస్టుగా ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. చట్టానికి, రాజ్యాంగానికి లోబడి… ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో చాలా ఎగ్రెసివ్‌గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మూర్తిపై ఏపీ సర్కార్ కక్ష గట్టిందన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం.. కరోనా వైరస్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తే… విపత్తు చట్టం కింద కేసు నమోదు చేస్తామని ప్రకటించింది.
ఆ చట్టం కింద.. మూర్తిపై కేసులు పెట్టారని.. అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక్క సారిగా గుప్పుమంది. అయితే ఆయనపై కేసులు నమోదయ్యాయని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ బయటకు మాత్రం విపరీతంగా ప్రచారం చేశారు. ఈ విషయంలో మూర్తి తనకు న్యాయపరమైన అవకాశాల్ని ఉపయోగించుకున్నారు. మరి ప్రభుత్వం జర్నలిస్టు మూర్తిని అరెస్ట్ చేయాలనే పట్టుదల చూపిస్తుందా.. లేక వెనక్కి తగ్గుతుందా వేచి చూడాలి.. !