మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసహనం అరెస్టులకు తెగబడుతోందా..? తప్పులు ఎత్తి చూపిస్తే కేసులు పెట్టేందుకూ వెనుకాడటం లేదా..? టీవీ5 జర్నలిస్ట్ మూర్తిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని బుధవారం సాయంత్రం సీఐడీ వర్గాల నుంచి మీడియాకు లీక్ వచ్చింది. మూర్తి చర్చా కార్యక్రమాలు అన్నీ.. అగ్రెసివ్‌గా ఉంటాయి కానీ.. దానికే అరెస్ట్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఏం కేసు పెట్టారు..? ఎందుకు పెట్టారు..? లాంటి విషయాలేమీ పెద్దగా బయటకు రాలేదు. కానీ మూడు ప్రత్యేక బృందాలు ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నాయని మాత్రం మీడియాకు సమాచారం అందింది. ఇదే విషయాన్ని టీవీ5 యాజమాన్యానికి కూడా సీఐడీ పోలీసులు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇంతకి జర్నలిస్ట్ మూర్తి చేసిన నేరం ఏమిటో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వం ఇటీవలి కాలంలో వైరస్ విషయంలో ప్రభుత్వం చెప్పింది మాత్రమే ప్రజలకు వివరించాలని… ఇంకేమైనా చెబితే… విపత్తుల నిర్వహణ కింద కేసులు పెడతామని హెచ్చరిస్తూ వస్తోంది. బహుశా.. మూర్తి నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో.. ఏదైనా.. అంశంపై.. ఆయన ప్రభుత్వం ప్రకటించని సమాచారాన్ని చెప్పి ఉంటారేమోనని.. ఆయనను అరెస్ట్ చేయడానికి దానినో అవకాశంగా మల్చుకుని ఉంటారని భావిస్తున్నారు. ఆయనపై పెట్టిన కేసులేమిటో.. బయటకు చెప్పిన తర్వాతే.. అసలేం తప్పు జరిగిందో తెలుస్తుంది. నిజానికి బుధవారం రాత్రే… మూర్తిని అరెస్ట్ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం అసహనానికి గురవుతోందంని… గతంలో… సాక్షి మీడియా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకోవాలని మీడియా వర్గాలు పోస్టులు పెట్టడం ప్రారంభించాయి.
ప్రభుత్వానికి టీవీ5 మూర్తి చాలా కాలంగా ఇబ్బందికరంగా మారారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన ప్రత్యక్షంగా పోరాడుతున్నారు. అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయంపై అండగా నిలబడ్డారు. ప్రజలకు నష్టం కలిగించే ప్రతీ నిర్ణయాన్ని తన చర్చా కార్యక్రమాల్లో చర్చించారు. తప్పొప్పులు బయటపెట్టారు. ఆయనపై వైసీపీ సోషల్ మీడియా చాలా తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేసింది. ఇప్పుడు వాటన్నింటికీ అరెస్ట్‌తో లెక్క తేల్చుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లుగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.