ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్ చేసుకున్నారు. కానీ మీడియా సంస్థలో పని చేసేవారికి కూడా.. యాజమాన్యం మారిందా అన్నదానిపై గిల్లుకుని చూసుకోవాల్సి వచ్చింది. అలాంటిదేమీలేదు. మరి ఎందుకు పుకారు పుట్టించారు అంటే…. నిప్పులేనిదే పొగ రాదన్నట్లుగా… టీవీ5పై వ్యతిరేకత చూపించే పార్టీ వారికి.. ఓ అంశం దొరికింది. దాన్ని పట్టుకుని టీవీ5ని అమ్మేశారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ప్రతీ నెలా అనుమతి పొంది టీవీ చానళ్ల కంపెనీల పేర్లు, వాటి డైరక్టర్ల పేర్లను అప్ డేట్ చేస్తూ ఉంటుంది. అలా నెల క్రితం అప్ డేట్ చేసిన లిస్ట్‌లో శ్రేయా బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ డైరక్టర్ల పేర్లను ఉత్తరాది పేర్లతో నింపేశారు. శ్రేయా బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ టీవీ5తో పాటు మరో రెండు చానళ్లను నడుపుతోంది. దీంతో టీవీ5ను అమ్మేశారని హోరెత్తించారు. నిజానికి ఆ ఉత్తరాది వారి కంపెనీ శ్రేయ కాదు శ్రేయార్థ్… వాళ్లు జీఎస్ టీవీ అనే దాన్ని నడుపుతున్నారు.
అక్కడే తప్పు జరిగింది. దాన్ని ఆలస్యంగా గుర్తించారు టీవీ5 అంటే కోపం ఉన్నపార్టీల కార్యకర్తలు. దీంతో రచ్చ అయింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం టీవీ5 పై రకరకాల ఆరోపణలు చేస్తోంది. రఘురామకృష్ణరాజుతో యూరోల ఒప్పందం జరిగిందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. అయితే నిజానికి అలాంటిదేమీ లేదని తెలియడంతో.. కాసేపు ప్రచారం చేసుకుని తృప్తి పడ్డామన్న సంతృప్తి మాత్రమే వారికి మిగిలింది.