కొద్ది రోజుల క్రితం రాజ్ న్యూస్ అనే చానల్లో మైహోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమాలపై వరుస కథనాలు వచ్చాయి. భారీ సంచలనం సృష్టించే కథనాలు అంటూ ఆ సంస్థ ప్రోమో వేయగానే.. అర్జంట్‌గా మైహోమ్ సంస్థ హడావుడిగా హైకోర్టుకు వెళ్లి ప్రసారాలు చేయకుండా ఆదేశాలు తెచ్చుకుంది. ఆ ప్రసారాల్లో నిజాలు.. అబద్దాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ… మైహోమ్ సంస్థ మాత్రం తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కోర్టుకెళ్లి ఆ కథనాలను ఆపేయించుకున్నారు. కానీ అదే మైహోమ్ సంస్థ యజమానులకే చెందిన టీవీ9 మాత్రం.. ఇతర కంపెనీలపై బురద చల్లడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ప్రముఖ కంపెనీగా ఉన్న ఫీనిక్స్‌పై టీవీ9 వరుస కథనాలను ప్రచురించింది.
ఆ సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని తేల్చేస్తూ కథనాలు ప్రసారం చేసింది. అందులో నిర్ధిష్టమైన ఆరోపణలు లేవు. ఏవేవో సర్క్యూలర్లు.. రెరా నిబంధనల పేరుతో ఆ సంస్థపై వినియోగదారుల్లో నమ్మకం తగ్గించడానికే ఉద్దేశపూర్వకంగా రాసినట్లుగా ఉంది. టీవీ9 యాజమాన్యం ఎవరో తెలిసిన వారికి.. ఫీనిక్స్ సంస్థపై వచ్చిన కథనాలు చూస్తే.. ఖచ్చితంగా దురుద్దేశమేనని సులువుగానే అర్థమవుతుంది. కొద్ది రోజులుగా మైహోమ్ గురించి గొప్పగా ప్రచారం చేస్తూ.. ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలపై బురద చల్లడాన్ని టీవీ9 ఎడిటోరియల్ పాలసీగా పెట్టుకుంది.
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ఓ సారి.. జీవో 111 పేరుతో మరో సారి .. హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కోవాలనుకునేవారిని గందరగోళ పరిచి.. అందర్నీ మైహోమ్ కస్టమర్లుగా మార్చేందుకు … మీడియా క్రెడిబులిటినీ టీవీ9 దుర్వినియోగం చేస్తోందని.. సులువుగానే అర్థం చేసుకోవచ్చు. మీడియా సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో.. టీవీ9ని చూసి సులువుగానే అర్థం చేసుకోవచ్చని మీడియా రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.