ఐటీ దాడులు జరిగిన సంస్థల పేర్లు ఏమిటో సీబీడీటీ శాఖ తన ప్రెస్నోట్లో వెల్లడించలేదు. ఓ ప్రముఖ వ్యక్తి మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లోనూ సోదాలు చేశామని చెప్పింది. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో చెప్పలేదు. ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరో కూడా.. సీబీడీటీ నోట్లో లేదు. కానీ.. టీవీ9 పరిశోధన చేసింది. ఆ పరిశోధనలో… ఆ సెక్రటరీ ఎవరో కనిపెట్టింది. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో కనిపెట్టింది. కానీ ఆ మూడు కంపెనీలు ఏవో కనిపెట్టలేకపోయింది. ఒక వేళ కనిపెట్టినా అదేమంత గొప్ప విషయం.. ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం లేదనుకుందేమో కానీ… ప్రచారం ప్రారంభించారు. బోర్డు మీద.. కంపెనీలకు డబ్బులు ఎలా వస్తాయి.. ఎలా తరలిస్తారు.. షెల్ కంపెనీలు ఎలా సృష్టిస్తారు… అనేది స్పష్టంగా వివరిస్తూ కథనాలు ప్రసారం చేసింది. నిజంగా.. అసలు ఈ డొల్ల కంపెనీలు అంటే తెలియని వారికి..గొప్ప సమాచారం ఇచ్చాయి.
అయితే.. ఇక్కడ ఆ మూడు ఇన్ఫ్రా కంపెనీల గురించి చెప్పకుండా.. కేవలం శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో దొరికాయంటూ… షెల్ కంపెనీల గురించి రాసుకొచ్చారు. శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన పేరుపై ఒక్క కంపెనీ కూడా ఉండే అవకాశం లేదు. ఆయన ఇంట్లో దొరికింది రెండు లక్షలు, పన్నెండు తులాల బంగారం అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సరే.. సోర్స్ ద్వారా.. గొప్ప సమాచారం దొరికింది కాబట్టి చెబుతున్నారు అనుకున్నా… ఆ మూడు కంపెనీల గురించి మాత్రం.. చెప్పడం లేదు. అందులో ఒక కంపెనీ గురించి మాత్రం.. అసలు నోరెత్తడం లేదు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని మాత్రం వదిలి పెట్టకుండా రచ్చ చేస్తున్నారు.
నిజానికి ఇలాంటి దాడులు కొన్నాళ్ల కిందట.. ఓ బడా పారిశ్రామికవేత్తపై జరిగాయి. పది రోజుల పాటు జరిగాయి.ఇప్పుడు విడుదల చేసినట్లే అప్పట్లోనూ.. సీబీడీటీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. కొన్ని వేల కోట్లు అక్రమంగా తరలించారని స్పష్టం చేసింది. దాని గురించి కనీసం ఒక్క వార్త ప్రసారం చేయలేదు. దానికి కారణం… ఆ ఐటీ దాడులు జరిగింది.. తన యజమానిపైనే. కానీ ఇప్పుడు.. మూడు కంపెనీలను పక్కన పెట్టి.. ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసింది పేరుగొప్ప టీవీ చానల్. రాజకీయాల కోసం మీడియాను అమ్ముకుంటున్న వైనం మరోసారి స్పష్టమయింది.