తెలుగు వార్త ఛానల్స్ లో టీవీ 9 కి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. వార్తను ప్రజెంట్ చేసే విషయంలో ఆ ఛానల్ కు దరిదాపుల్లోకి కూడా ఇతర చానల్స్ లేవని చెప్పడం అతిశయోక్తి కాదు. కానీ క్వాలిటీ విషయంలో బాగానే ఉన్నప్పటికీ, ప్రజల కడుపు మండుతున్న సమయంలో కూడా, అధికార ప్రభుత్వాల మీద పల్లెత్తు మాట అనకుండా ఛానల్ చూపిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు మాత్రం పలుమార్లు చర్చనీయాంశం అయ్యాయి.
ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్వాకం వల్ల పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న అంశాన్ని వార్తగా ప్రస్తావిస్తూ, ” తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 18 మంది చనిపోయారు ” అంటూ టీవీ9 వార్త ఇవ్వడం సోషల్ మీడియాలో విమర్శలకు కారణమైంది. నిజానికి ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పేచీ లేదు. కేవలం తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే, “తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు” అని రాయకుండా, “తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఆత్మ హత్య” అంటూ వ్రాయడం ఎవరికి భయపడి చేస్తున్నారు లేదంటే ఎవరిని మెప్పించడానికి చేస్తున్నారు అన్న విమర్శలు సోషల్ మీడియాలో తీవ్రంగా వస్తున్నాయి.
ఇదే తరహా ఏదైనా చిన్న అడ్మినిస్ట్రేటివ్ సమస్య అమెరికాలో గనక వచ్చి ఉంటే, దాని కారణంగా తెలుగు విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఉంటే, ఈ పాటికి ల్యామినేటెడ్ సైజు ట్రంప్ ఫోటో పెట్టి మరీ టీవీ9 ఉతికారేసి ఉండేది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, తెలంగాణ విషయానికి వచ్చేసరికి, నింద తెలంగాణ ప్రభుత్వం మీదికి రాకుండా చేయడం కోసం ఎన్ని రకాల జిమ్మిక్కులు వాడాలో అన్ని రకాల జిమ్మిక్కులు టీవీ9 వాడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం తప్పంతా బోర్డుదేనని చెబుతూ ఎక్కడా తెలంగాణ విద్యాశాఖా మంత్రిని కానీ, తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ పల్లెత్తు మాట అనకుండా, వారికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా, వీరు న్యూస్ ప్రెసెంట్ చేస్తున్న విధానం చూస్తే, బోర్డు నిర్వాకం వల్ల కడుపు మండిన వారు కూడా వీరి తెలివితేటలకు హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేకపోతున్నారు.
ఏది ఏమైనా, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే, వీలైనంత త్వరగా ఈ సమస్య కి దొరికితే చాలు అన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.