కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకలో చాలామంది సినిమాను మించి పవన్ కళ్యాణ్‌ను పొగడ్డం అందరూ చూశారు. ఈ ఉత్సవం ఏర్పాటు చేయడంలో సినిమాను మించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు దోహదం కలిగించడం పరోక్ష ఎజెండాగా కనిపించింది. మూడేళ్లుగా జనసేన నడుపుతున్న నాయకుడు గనక అందులో తప్పులేదు కూడా. వేదికపై ఆయనతో పాటు టీవీ9 రవిప్రకాశ్, ఎన్టివి నరేంద్ర చౌదరి కూడా వుండటం అందరినీ ఆకర్షించింది. అయితే ఉదయాన్నే చూస్తే ఈనాడు ఆదివారం పుస్తకం టైటిల్ పేజీ పవన్‌దే. ఆంధ్రజ్యోతి ఆర్కే కూడా అనుకూలంగానే వ్యాఖ్య్యలు చేశారు.ఇవన్నీ చూస్తుంటే నాకు చిరంజీవి ప్రజారాజ్యం రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పటి నుంచినేను చాలా క్రమబద్దంగా చర్చలలో పాల్గొంటూ పరిణామాలు ప్రత్యక్షంగా చూశాను. చిరంజీవి పార్టీ పెట్టకముందు పెట్టాక కొద్ది రోజులు ఎక్కడ లేని ప్రచారం ఇచ్చిన కొన్ని మీడియా సంస్థలు అంతకంటే వేగంగా దాడి చేయడం మొదలెట్టాయి. ఆయన వ్యక్తిత్వంపై సందేహాలు సృష్టించాయి. చివరకు ఆయన తట్టుకోలేక ఎదురుదాడికి దిగాల్సి వచ్చింది. చిరు కాంగ్రెస్‌లో విలీనమయ్యేవరకూ ఈ శక్తులు వెంటాడాయి.
ఇప్పుడు చూస్తుంటే అవే శక్తులు పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే వ్యూహం పునరావృతం చేస్తున్నాయనిపిస్తుంది.ఆయనను అదేపనిగా పొగుడుతూనే అధికార పక్షాలను వెనకేసుకురావడం. తద్వారా పవన్ కళ్యాణ్ విశ్వసనీయతపైన సందేహాలు సృష్టించడం. అధిక ప్రచారం ఇవ్వడం ద్వారా టిడిపి బిజెపి పవన్ ఇప్పటికీ ఒకటే అన్న భావన కలిగించడం.
చంద్రబాబును ఏమీ అనకుండా కేంద్రాన్ని తిట్టిపోసే లక్షణం ప్రత్యేక హౌదా విషయంలో టీవీ9 ప్రదర్శించింది. ఒక ,కెసిఆర్‌ను నెత్తిన మోసే పని మరోవైపవు చాలామంది చేస్తున్నారు. ఈ పనిలో తలమునకలవుతున్న వారే మీడియా స్వతంత్రత గురించి విమర్శించడం హాస్యాస్పదం కదా!ఏమైతేనేం పవన్ కళ్యాణ్ చుట్టూ పెద్ద బృందమే వుండబోతుంది. వారి వత్తాసులో వున్న లోగుట్టును పవన్ గనక పసిగట్టకపోతే కొద్ది కాలంలోనే వారు ఆయనకూ దారితప్సిస్తారు.మరో చిరును చేస్తారు. ఎందుకంటే వారు అఘటన ఘటనా సమర్థలు. నిజానికి మీడియా పాత్రపై ఈ వారం రవిప్రకాశ్ లాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్న కూడా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద తతంగమే జరుగుతుందనిపిస్తుంది. మరి కాటమరాయుడు హుషారుగా వుండకపోతే కాటు పడొచ్చు. ప్రజారాజ్యం అధ్యాయం నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నానంటున్న పవన్ కళ్యాణ్ కొన్ని వర్గాలు ఒక క్రమపద్ధతిలో దాన్ని దెబ్బతీసిన తీరును కూడా గుర్తించి వుంటారని ఆ తప్పులు జరగనివ్వబోరని ఆశించాలి. చిరంజీవిలా డీలా పడకుండా వుండాలి