“తన దాకా వస్తేగానీ..” అని తెలుగులో ఒక నానుడి. ఈ రోజు టీవీ9 సీఈఓ రవిప్రకాష్, కొన్ని చానల్స్ ని ఉద్దేశించి “చానళ్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ రవి ప్రకాష్ నివాసంలో సోదాలు జరిగాయని, రవి ప్రకాష్ మీద ఫోర్జరీ ఆరోపణలతో పోలీసు కేసు నమోదైందని కొన్ని ఛానల్ లో వార్తలు వచ్చాయి. అయితే కొన్ని చానల్స్ రవిప్రకాష్ పరారీలో ఉన్నాడు అని వ్యాఖ్యానించడాన్ని రవి ప్రకాష్ టీవీ9 లో లైవ్ ప్రోగ్రాం లో ఖండించాడు. అలాగే తనను సీఈవో స్థానం నుంచి తప్పించారని వస్తున్న వార్తలను కూడా ఖండించాడు. ఆ క్రమంలో “చానళ్లు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అంటూ చానల్స్ కి హితవు పలికాడు. అయితే గత పదిహేనేళ్లలో టీవీ9 ని ఉద్దేశించి ఇదే మాట ఎంత మంది ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా అనుకున్నారో చెప్పనక్కర్లేదు. మిగతా చానళ్లను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికిన రవి ప్రకాష్ కి చెందిన ఇదే టీవీ9 గతంలో కొన్ని సంఘటనలు విషయం లో వ్యవహరించిన తీరును గమనిద్దాం, అప్పుడు టీవీ9 బాధ్యతాయుతంగా వ్యవహరించిందో లేదో అన్న సంగతిని పాఠకులకే వదిలేద్దాం.
శ్రీజ వ్యవహారం లో టీవీ9 వైఖరి:
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు టీవీ9 వ్యవహరించిన తీరును అప్పట్లో చాలామంది ఆక్షేపించారు. రోజంతా ఆ వ్యవహారాన్ని లైవ్ ఇవ్వడం, చిరంజీవి ఇంటి ముందు కెమెరా పెట్టి స్పందించమని అడగడం, అల్లు అరవింద్ ఆఖరికి టీవీ9 మైక్ ముందుకు వచ్చి “ఏమని స్పందిస్తాం, మీరే చెప్పండి” అంటూ దీనంగా వేడుకోవడం ప్రజల మస్తిష్కాల్లో ఇంకా సజీవంగానే ఉంది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి వేయండి అని కుటుంబం తరపున వారు చేతులు జోడించి వేడుకున్నా, ఆ వార్తని ఆ తర్వాత కూడా రోజుల తరబడి గంటలపాటు టీవీ9 లో చర్చించడం కూడా ప్రజలకు ఇంకా గుర్తుంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలో, అచ్చం ఇలాగే బతిమాలినా టాలీవుడ్ ప్రముఖులు
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు అప్పట్లో కలకలం సృష్టించింది. పోలీసులు రోజుల తరబడి విచారణ జరపడం, దాన్ని టీవీ9 అనుక్షణం లైవ్ ఇవ్వడం, వారు నిందితులు గా కానీ బాధితులుగా కానీ నిర్ధారణ కాకముందే, వారి మీద ప్రైమ్ టైం స్టోరీలు ప్రసారం చేయడం తెలిసిందే. అప్పట్లో పూరి జగన్నాథ్ దగ్గర నుండి చాలామంది సినీ ప్రముఖులు, టీవీ9 ని అచ్చం ఇలాగే వేడుకున్నారు – “కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించండి అని”. దయచేసి మా కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కొంచెం బాధ్యతగా వ్యవహరించాలని వారు చేసిన విజ్ఞప్తులు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయి. వారి విజ్ఞప్తుల అనంతరం కూడా టీవీ9 ఎలా వ్యవహరించాలో కూడా ప్రజలకు బహుశా గుర్తుండే ఉంటుంది.
టీవీ9 స్టూడియోలోనే, టీవీ9 కు చురకలంటించిన మహేష్ బాబు, మరొక సందర్భంలో ఇలాగే విజ్ఞప్తి చేసిన రవితేజ
టీవీ9 స్టూడియోలో యాంకర్ స్వప్న మహేష్ బాబు ని ఇంటర్వ్యూ చేసిన ఒక ఇంటర్వ్యూలో, టీవీ9 ధోరణిని మహేష్ బాబు తప్పు పట్టిన సంగతి కూడా కొంత మందికి గుర్తుండే ఉంటుంది. తాను కుటుంబ సభ్యుల సమక్షంలో నమ్రతను వివాహం చేసుకుంటే, తాను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నానని అంటూ టీవీ9 కథనాలు ప్రసారం చేసిందని, అవి తనను చాలా బాధించాయని మహేష్ బాబు టీవీ9 ఇంటర్వ్యూ లోనే చెప్పుకొచ్చారు. అలాగే రవితేజ తమ్ముడు చనిపోయినప్పుడు, రవితేజ అ తమ్ముడి ఆఖరి చూపు కు రాకపోవడం గురించి ప్రసారం చేసిన కథనాల మీద రవితేజ కూడా ఇలాగే స్పందించాడు. పదాలు కాస్త అటు ఇటుగా వేరైనా, అప్పుడు రవితేజ వ్యాఖ్యల అర్థం కూడా – “చానళ్లు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అన్నదే.
శ్రీ రెడ్డి వ్యవహారం సమయంలో కూడా ఇవే విమర్శలు
క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి గళమెత్తుతూ శ్రీ రెడ్డి టీవీ చానల్స్ ముందుకు వచ్చినప్పుడు దాదాపు చాలా మంది ఆవిడను సమర్థించారు. అయితే రోజుకు నాలుగైదు గంటలపాటు జరిగే ఆ చర్చలు దారి తప్పడం, ఇంటిల్లిపాదీ చూసే టీవీ చానల్స్ లో వస్తున్న ఆ చర్చలు పిల్లలతో కలిసి చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నాయంటూ చాలామంది తమ అభ్యంతరాలు తెలుపుతూ ఇదే మాట అన్నారు – “చానల్స్ కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని.
అప్రధాన వార్తలకు ప్రాధాన్యం, అవసరమైన వార్తలకు దక్కని ప్రాధాన్యం
జబర్దస్త్ ప్రోగ్రాం లో ఒక కామెడీ స్కిట్ లో ఒక చిన్న పొరపాటు వ్యాఖ్య దొర్లినప్పుడు, దానిమీద శనివారం ఉదయం నాలుగు గంటల పాటు మధ్యాహ్నం నాలుగు గంటల పాటు, ఆదివారం ఉదయం నాలుగు గంటల పాటు మధ్యాహ్నం నాలుగు గంటల పాటు- ఇలా సుమారు 16 గంటలపాటు ఏకబిగిన చర్చలు పెట్టారు. అన్నేసి గంటలపాటు జబర్దస్త్ ని విమర్శించడానికి కేటాయించిన టీవీ9 అంతటి సమయాన్ని నిజంగా ముఖ్యమైన సమస్యలకు కేటాయించడం లేదు, వాటికి అంతటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్నది అప్పట్లో టీవీ9 మీద వచ్చిన ప్రధాన విమర్శ. మరీ ముఖ్యంగా స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాల్సిన సంఘటనల వద్దకు వచ్చేసరికి తూతూమంత్రంగా వార్తలను ఇవ్వడం, ప్రభుత్వాలకు గానీ ప్రజా సమస్యలకు గాని సంబంధించని వ్యక్తిగత కేసుల విషయంలో – ఉదాహరణకు బ్యూటీషియన్ శిరీష హత్య కేసు, కొంత మంది కుటుంబ కలహాలకు సంబంధించిన కేసులు – ఇలాంటి విషయాలకు, ఇలాంటి వార్తలకు మాత్రం విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడం చాలామంది ప్రేక్షకులను, సామాన్య ప్రజలను అసహనానికి గురిచేసింది. అప్పుడు వారు చేసిన విజ్ఞప్తి కూడా ఇదే – ఛానళ్లు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” .
రాజకీయ పార్టీల విషయంలో వివాదాస్పద వైఖరి
రవి ప్రకాష్ ఈరోజు టీవీ9 లైవ్ లో మాట్లాడుతూ, తమ ఛానల్ జర్నలిజం విలువలకు కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. నిజమైన మీడియా అనేది ఒక ప్రతిపక్షం తీరున, అధికారపక్షం చేసే లోపాలను ఎత్తిచూపుతూ వార్తలను ప్రజెంట్ చేయాలి అని అంటూ ఉంటారు. అయితే టీవీ9 విషయంలో – అధికార పార్టీ లకు వత్తాసు పలుకుతోంది అన్నది ఆ ఛానల్ మీద ఉన్న ఒక ప్రధాన విమర్శ. గత పదిహేనేళ్లలో అధికార పక్షాన్ని ఇబ్బందిపెట్టేలా ఒక్క స్టింగ్ ఆపరేషన్ కూడా చేయకపోవడం, (రాష్ట్ర) అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఒక్క చర్చ కి కూడా – జబర్దస్త్ ను విమర్శించడానికి కేటాయించిన సమయంలో గానీ, శ్రీ రెడ్డి కి ఇచ్చిన స్క్రీన్ సమయంలో కానీ పదవ వంతు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఇవే కాకుండా ప్రజారాజ్యం, జనసేన లాంటి కొత్త పార్టీలు వచ్చినప్పుడు, ఆ పార్టీలు బలపడకుండా చేయడం కోసం టీవీ9 ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది అన్నది కూడా ఆ ఛానల్ మీద ఉన్న ప్రధాన విమర్శ.
ఇలా చెప్పుకుంటూ పోతే గత పదిహేనేళ్లలో టీవీ9 వ్యవహార శైలి మీద చాలా విమర్శలు వచ్చాయి. చాలా మంది చాలాసార్లు టీవీ9 ను వేడుకుంటూ చేసిన విజ్ఞప్తి – “చానల్స్ కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలను అదే ఛానల్ సీఈఓ అయిన రవి ప్రకాష్ నోట వినడం ప్రజలకు ఆశ్చర్యంగా అనిపించింది.
కొస మెరుపు:
ఈ రోజు దాదాపు అన్ని చానల్స్ లోనూ రవి ప్రకాష్ లామినేటెడ్ ఫోటో పెట్టి, 420 అని రాస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నారు. రవి ప్రకాష్ వివరణ చూస్తే ఆ చానల్స్ అలా చేయడం ఆయనకు ఎంత బాధ కలిగించిందో అర్థమవుతోంది. అయితే ఒక చిన్న వార్తగా ఇచ్చి వదిలి వేయవలసిన ఇలాంటి అంశాలని ఈ తరహా లో ల్యామినేటెడ్ ఫోటోలు పెట్టి, బీభత్సమైన వాయిస్ ఓవర్ తో అవతలి వాళ్ళ వ్యక్తిత్వాన్ని పూర్తిగా హననం చేసేలా కథనాలు చేయడాన్ని వీరందరికీ నేర్పించింది కూడా టీవీ9 రవి ప్రకాషే మరి !!
– జురాన్ (@CriticZuran)