ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో జలగండానికి ముహుర్తం ఖరారయింది. ఇప్పటికే కృష్ణాబోర్డు వ్యవహారంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం అంశంపై .. తెలంగాణ సర్కార్ తీరుపై ఏపీ సర్కార్ ఫైర్ మీద ఉంది. అయితే ఇప్పుడు కొత్త వివాదం మరొకటి తెరపైకి వచ్చింది. రాజోలిబండ బండ వద్ద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ వద్ద కుడి కాలువ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ విషయాన్ని టీవీ9 హంగామా చేయడం ప్రారంభించింది. నిజానికి అక్కడ పనులు జరుగుతున్నాయో లేదో తెలియదు.. కానీ.. టీవీ9 మాత్రం.. హోరెత్తించింది. తెలంగాణ నేతల స్పందన తీసుకోవడం ప్రారంభించింది.
టీవీ9 ఎందుకిలా ఆర్డీఎస్ కాలువ నిర్మాణంపై హడావుడి చేస్తుందో చాలా మందికి అర్థం కాని విషయం. ఆ కాంట్రాక్ట్ .. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగం అని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఆ కాంట్రాక్ట్ దక్కించుకుంది మేఘా ఇంజినీరింగ్ కంపెనీ కన్సార్టియమే. పనులు చేపడుతోంది కూడా ఆ కన్సార్టియమే. అంటే.. టీవీ 9 యాజమాన్య సంస్థనే పనులు ప్రారంభించిదన్నమాట. అలాంటిది … మేఘా ఇంజినీరింగ్ ప్రారంభించిన పనలు చట్ట విరుద్ధం.. అక్రమం అంటూ.. టీవీ9నే ప్రచారం ప్రారంభించడం వెనుక… ఖచ్చితంగా రాజకీయం వ్యూహం ఉందని అనుకోవాలని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ రాజకీయ నేతలు చురుగ్గా స్పందిస్తున్నారు.
ఎమ్మెల్యే అబ్రహం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్… ఏపీ సర్కార్కు ఖచ్చితంగా తగు రీతిలో సమాధానం చెబుతామంటున్నారు. అటు కేంద్రం కానీ.. ఇటు కృష్ణ రివర్ బోర్డు అనుమతులు గాని లేకుండానే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డిఎస్ హెడ్ రెగ్యులేటరీ వద్ద కుడి కాలువ నిర్మాణం ప్రారంభించిందని అంటున్నారు. అలా అయితే..నేరుగా కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసి పనులు నిలిపివేయించడం చాలా సులువు. కానీ ఆ పని చేయకుండా.. మేఘా కంపెనీ యాజమాన్యంలోని మీడియానే పనుల గురించి రచ్చ ప్రారంభించడం వెనుక ఉన్న రాజకీయమేంటో తెలియాల్సి ఉందంటున్నారు.