” బంగారు గుడ్లు పెట్టే బాతు – అత్యాశకుపోయిన దాని యజమాని ” కథ .. చిన్న పిల్లలకు చెప్పే నీతి కథల్లో ఇప్పటికీ ఉంటుంది. చిన్న పిల్లలకు ఆ కథబాగానే అర్థమవుతోంది కానీ.. అలాంటి నీతులు కోకొల్లలుగా చెప్పే.. మీడియా వారికి మాత్రం అర్థం అవుతున్నట్లుగా లేదు. తెలుగులో తిరుగులేని చానల్‌గా ఉన్న టీవీ9 విషయంలోనే ఇది జరుగుతోంది. ఏ మీడియాకు అయినా విశ్వసనీయతే బలం. ప్రజల్లో అది కోల్పోతే.. జరిగేది పతనమే. ఇప్పటికే ఎన్నో మీడియా సంస్థలు.. యాజమాన్య స్వార్థ ప్రయోజనాల కోసం… పని చేసి అలాంటి పతనాన్ని.. చవి చూశాయి. ఈ కోవలోనే టీవీ9 కూడా చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కొన్నాళ్లుగా టీవీ9 ఫేక్ న్యూస్ మాత్రమే ప్రసారం చేస్తోంది. యాజమాన్యానికి అవసరం అయినట్లుగా.. వారికి ఇష్టం లేని.. లేదా.. వారికి అవసరమైన రాజకీయ పార్టీ కోసం.. ఫేక్ న్యూస్‌లు మాత్రమే ప్రసారం చేస్తోంది. అదీ కాదంటే.. జరిగిన విషయాల్ని ఫేక్‌గా చెప్పడానికి కూడా వెనుకాడటం లేదు. తమ యాజమాన్యానికి దగ్గర అయిన రాజకీయ పార్టీలకు కష్టం వస్తుందంటే.. ఆ వార్తలను స్కిప్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఎస్ఈసీ రమేష్ కుమార్ రాసిన లేఖ ఫేక్ అంటూ.,.. ఆ చానల్ ఎడిటర్ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పడిన తిప్పలేంటో అందరూచూశారు. ఆ లేఖను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఫేక్ కాదని కాస్త జర్నలిజం అనుభవం ఉన్న వారందరికీ స్పష్టమవుతుంది. అలాంటి లేఖలు రాసినప్పుడు.. ఎవరు కూడా తాను రాశానని బయటకు చెప్పుకోరు. ఆ లాజిక్ తెలిసే… తమ అభిమాన పార్టీపై మరకపడకుండా ఉండటం కోసం .. దాన్ని ఫేక్ అని చెప్పడానికి సాహసించారు.
ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలో చేస్తున్న హడావుడి అందరూ చూస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఉరిశిక్ష వేయడానికి తగ్గ అభియోగాల్ని ఇప్పటికే టీవీ9 మోపింది. ఇందులో వాస్తవాలెన్ని ఉంటాయో.. ఆ కథనాలను ప్రిపేర్ చేస్తున్న వారికి కూడా తెలుసు. ఇప్పుడీ టీవీ9 వార్తల ప్రహసనం ఎలా తయారయింది అంటే.. జనం కూడా.. వాళ్లంతే.. అని లైట్ తీసుకునేంత. రేవంత్ రెడ్డిపై ఎన్ని కథనాలు వేసినా.. ప్రజల్లో కనీస కదలిక రాలేదంటే.. టీవీ9 ప్రభావం ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు టీవీ9 ఏదైనా ఇష్యూ టేకప్ చేస్తే.. దానికి ఉన్న సేలబుల్ పవర్ కారణంగా.. ఇతర చానళ్లు రెడీ అయిపోయేవి. ఇప్పుడా పరిస్థితి పోయింది.
ఒకప్పుడు వార్త దినపత్రిక.. ఈనాడుతో పోటీగా.. మార్కెట్లోకి దూసుకు వచ్చింది. కొన్ని కొన్ని జిల్లాల్లో ఈనాడును మించిపోయి సర్క్యూలేషన్ సాధించింది కూడా. కానీ.. అలా వచ్చిన అవకాశాన్ని వార్త యాజమాన్యం రాజకీయ ప్రయోజనాల కోసం.. రాజ్యసభ లాంటి పదవుల కోసం వాడుకుంది. ఫలితంగా ఈనాడును అధిగమించాల్సిన వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇప్పుడు టీవీ9ది కూడా అదే పరిస్థితి. మొదట్లో ప్రొఫెషల్ జర్నలిస్టులు వేసిన పిల్లర్లు బలంగా ఉంది కాబట్టి.. కొన్ని రోజులు నిలబడుతుందేమో కానీ.. ఇదే పద్దతి కొనసాగిస్తే.. టీవీ9 మరో వార్త అవడం ఖాయమనడంలో ఎలాంటి సందేహం ఉండదు.