హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్ బండ్.. ఎంత ఉద్రిక్తంగా సాగిందో అందరూ చూశారు. పోలీసులు ఉద్యోగుల్ని లాఠీలతో కుళ్లబొడిచిన వైనం.. నిర్బంధం… చలో ట్యాంక్‌బండ్‌పై ఉక్కుపాదం మోపిన వైనం.. సోషల్ మీడియా కూడా.. అందరి ముందు ఉంచింది. కానీ తెలుగులో పేరెన్నికగన్న చానల్ టీవీ9 మాత్రం.. వేరే రకమైన కవరేజీ ఇచ్చింది. ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా.. కథనాలు ప్రసారం చేసింది. వారి పోరాటాన్ని కించ పరిచే ప్రయత్నం చేసింది. ఈ ఎఫెక్ట్.. కవరేజీలో కూడా పడింది. న్యూస్‌లో చెప్పేది వేరైనా.. ట్యాంక్ బండ్ మీద.. ఆ చానల్ సిబ్బంది .. గట్టిగానే కవరేజీ చేశారు. ఆ సమయంలో.. టీవీ9కు వ్యతిరేకంగా ఉద్యోగాలు నినాదాలు చేశారు. తమకు టీవీ9 కవరేజీ వద్దని గొడవ పడిన దృశ్యాలు కూడా కనిపించాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో.. టీవీ9 తెలంగాణకు వ్యతిరేకమని.. విమర్శలు వచ్చాయి. టీఆర్ఎస్ నేతలు సహా.. తెలంగాణ వాదం వినిపించే ఏ ఒక్కరు కూడా.. టీవీ9 కవరేజీని విమర్శిస్తూనే ఉన్నారు. తెలంగాణ వ్యతిరేక చానల్‌గా ముద్రవేసేశారు. ఆంధ్రా చానళ్ల జాబితాలో మొదటి పేరు టీవీ9దే పెట్టేవారు. టీఆర్ఎస్ నేతలు ఇలాంటి విమర్శకుల్లో ముందు ఉంటారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీఆర్ఎస్ నేతలే.. టీవీ9ని తమ చానల్ అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్ని.. ఉన్నది ఉన్నట్లుగా కాకుండా… బయాస్ చేసి టెలికాస్ట్ చేస్తోందని.. ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు.. టీవీ9 ఉద్యమాలకు వ్యతిరేకంగానే ఉంది. కానీ.. మౌలికమైన మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
గతంలో టీవీ9 ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రదర్శనలకు.. సపోర్ట్ గా నిలబడేది. మంచి కవరేజీ ఇచ్చేది. దానికి మాజీ సీఈవో రవిప్రకాష్.. బ్యాక్ గ్రౌండ్ కారణం కావొచ్చు. టీడీపీ హయాంలో విద్యుత్ ఉద్యమంలో.. ఆయన చేసిన కవరేజీతోనే… మీడియాలో ఆయనకు ఓ రేంజ్ ఏర్పడింది. ఆ తర్వాత అలాంటి ఆందోళనలకు మీడియా పరంగా టీవీ9 సపోర్ట్.. కవరేజీ బాగానే వచ్చేది. ఒక వేళ ప్రాధాన్యత ఇవ్వకపోయినా… నిరాశపరిచేలా.. కథనాలు మాత్రం రాసేది కాదు. కానీ.. ఇప్పుడు.. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమంపై.. ఓ రకంగా.. కత్తిగట్టినట్లుగా కథనాలు రాస్తున్నారు. దీని ద్వారానే టీవీ9 క్యారెక్టర్లోనే మౌలిక మార్పు కనిపించడం ప్రారంభమయింది.