టీవీ9 పొలిటికల్ ఇంటర్యూలలో.. తనదైన ముద్ర వేసిన జాఫర్‌ను కొత్త యాజమాన్యం బయటకు పంపేసింది. బలవంతంగా రాజీనామా లేఖ తీసుకుని..ఇక టీవీ9తో ఎలాంటి అనుబంధం లేదని తేల్చి పంపేసింది. టీవీ మోడల్‌కు తగ్గట్లుగా ఇంటర్యూలు చేస్తూ.. టీవీ9 టీఆర్పీల్లో తన వంతు కాంట్రిబ్యూషన్ ఇచ్చిన జాఫర్.. రవిప్రకాష్‌కు సన్నిహితుడనే పేరు ఉంది. టీవీ9 కొత్త యాజమాన్యం… రవిప్రకాష్ సన్నిహితులెవర్నీ.. సంస్థలో ఉంచకూడదన్న లక్ష్యంతో.. ఒక్కొక్కర్ని టార్గెట్ చేసి.. మరీ బయటకు పంపుతోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో తాజాగా చేరిన పేరు జాఫర్. ఈ సీనియర్ జర్నలిస్టుతో కొత్త యాజమాన్యం రాజీనామా చేయించడానికి కారణం కూడా.. చాలా సిల్లీగా ఉందని టీవీ9 ఆఫీసులో చర్చ జరుగుతోంది. రవిప్రకాష్ పుట్టిన రోజున.. ఆయన ఆఫీసుకు వెళ్లి జాఫర్ అభినందించి వచ్చారట. ఇది కొత్త యజమాన్యానికి నచ్చలేదు. తాము బద్ద శత్రువుగా భావిస్తున్న వ్యక్తిని కలవడం నేరంగా భావించారు.
అయితే.. రవిప్రకాష్, జాఫర్ వ్యక్తిగతంగా స్నేహితులు. టీవీ9 ఇతోధిక వృద్ధిలో …రవిప్రకాష్ నేతృత్వంలో జాఫర్ కూడా పని చేశారు. బహుశా.. టీవీ9లో వాటాల వివాదం, రవిప్రకాష్‌పై కేసులు మొదలైన తర్వాత కూడా.. పలుమార్లు జాఫర్ రవిప్రకాష్‌ని కలిసే ఉంటారు. అయితే.. అప్పట్లో సైలెంట్ గా ఉన్న యాజమాన్యం … ఇప్పుడు… మాత్రం… రవిప్రకాష్‌ను కలిశారన్న కారణంగా ఏకంగా రాజీనామానే తీసుకున్నారు. ప్రస్తుతం రవిప్రకాష్.. దక్షిణాది మీడియా చానళ్లను ప్రారంభించే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి “ప్రి ప్రొడక్షన్ ” పనులు చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. జాఫర్ కూడా.. రవిప్రకాష్‌తో చేరుతారేమో అన్న అనుమానంతో.. ముందుగానే.. యాజమాన్యం రాజీనామా చేయించిందని చెబుతున్నారు.
మైనార్టీ వర్గానికి చెందిన జాఫర్.. తెలుగు మీడియాలో ప్రముఖ జర్నలిస్టుగా అనతి కాలంలోనే ఎదిగారు. మరే మైనార్టీ జర్నలిస్టు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోలేదు. జాఫర్ చేసిన టీఆర్పీ బేస్డ్ ఇంటర్యూలు… బిగ్‌బాస్‌కూ నచ్చాయి. హౌస్‌లోకి కూడా వెళ్లారు. జాఫర్ తొలగింపు వ్యవహారం ఇప్పుడు.. టీవీ9లో ఆభద్రతకు కారణం అవుతోంది. రవిప్రకాష్ సన్నిహితులందర్నీ తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతూండటంతో.. అందరిలోనూ ఆందోళన ప్రారంభమయింది.ఎందుకంటే.. టీవీ9లో ఉన్న వారందరూ రవిప్రకాష్ సన్నిహితులే. ఇటీవలి కాలంలో చేరిన కొద్ది మందితో.. రవిప్రకాష్ టైం నుంచి ఉన్న వారిపై.. పితూరీలు చెప్పించుకుని.. యాజమాన్యం.. మెల్లగా అందర్నీ టార్గెట్ చేస్తోందని అంటున్నారు. ముందుగా వారికి ప్రాధాన్యం కల్పించినట్లుగా కల్పించి.. తర్వాత ఏదో ఓ కారణం చూపి..ఎగ్జిట్ గేటు చూపిస్తున్నారన్న చర్చ టీవీ9లో కనిపిస్తోంది. ముందు ముందు టీవీ9లో మరిన్ని మార్పులు… ఖాయంగా కనిపిస్తోంది.