టీవీ9 పూర్తిగా గతి తప్పిపోయినట్లుగా కనిపిస్తోంది. విశ్వక్ సేన్ అనే ఓ చిన్న సినీ హీరోను పట్టుకుని… తమ అస్తిత్వం మీద దెబ్బకొట్టారన్నట్లుగా లబలబలాడిపోతోంది.రోజంతా అదే ప్రస్తావనతో ప్రసారాలు చేస్తోంది. రాజకీయ నాయకుల దగ్గర మైకులు పెట్టి.. వారితో నటుడు విశ్వక్ సేన్ గురించి రాష్‌గా మాట్లాడించి.. బ్రేకింగులు వేస్తోంది. అది సరిపోదన్నట్లుగా యాంకర్ దేవి నాగవల్లి ప్రత్యేకంగా రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి న్యాయం చేయాలని వేడుకుంటోంది. వాటిని కూడా టీవీ నైన్ ప్రసారం చేస్తోంది.
టీవీ9 తీరు చూసి ప్రేక్షకులు కూడా అవాక్కవ్వాల్సి వస్తోంది. టీవీ 9 బాధనే ప్రజలందరి బాధనా అన్నట్లుగా వ్యవహారం మార్చేయడంతో వారు చానల్‌ను మార్చుకోక తప్పడం లేదు. అసలు విశ్వక్ సేన్ వ్యవహారంలో టీవీ9 స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించలేదు. ఈ విషయంలో ఆ చానల్‌కు ఎంత దారుణమైన ఫీడ్ బ్యాక్ వచ్చిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియా పేరుతో బూతులు తిట్టి..ఎదుటి వారు తిడితే.. ఆ తిట్లపై రచ్చ చేయడం చూసేవారికి కామెడీగా అనిపిస్తోంది.
ఉన్నతమైన టీవీ9 ఇప్పుడు విశ్వక్ సేన్‌తో తాడోపేడో తేల్చుకుంటోంది. ఏ పబ్లిసిటీ కోసం అయితే విశ్వక్ ఇంత కష్టపడుతున్నాడో.. అంత కంటే ఎక్కువ పబ్లిసిటీ ఇప్పుడు టీవీ 9 ఇస్తోంది. అదే సమయంలో పరువు కూడా పోగొట్టుకుంటోంది. టీవీ9 ఎడిటోరియల్ టీం ఇప్పటికైనా కాస్త తల పైకెత్తి తమ చుట్టూ ఏం జరుగుతుందో చూస్తే్.. తామెంత దిగజారిపోయామో అర్థం చేసుకుంటారు. లేకపోతే.. పాతాళం అందుకునేదాకా ఆగే చాన్సే ఉండకపోవచ్చు.