బిగ్ బాస్ సీజన్ 5 టిఆర్పి రేటింగుల పరంగా దూసుకెళ్తోంది. జెమినీ టీవీ లో ఎవరు మీలో కోటీశ్వరుడు, మాస్టర్ చెఫ్ వంటి కార్యక్రమాలను జూనియర్ ఎన్టీఆర్ , తమన్నా వంటి పెద్ద స్టార్ లను పెట్టుకొని రూపొందించినా, బిగ్ బాస్ చాలా ఆలస్యం గా రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతున్నప్పటికీ రేటింగ్ విషయం లో మిగతా అన్ని కార్యక్రమాల కంటే కూడా దుమ్ము దులుపుతోంది. అయితే గత సీజన్ల లో బిగ్ బాస్ కార్యక్రమం పై వరుస బెట్టి పాజిటివ్ కథనాలను అందించిన టీవీ9, ఈ సీజన్లో మాత్రం వరుస పెట్టి నెగటివ్ కథనాలను ప్రసారం చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
గత సీజన్ల లో బిగ్ బాస్ ని భుజాల పై మోసిన టీవీ9:
గత సీజన్ లో బిగ్ బాస్ కార్యక్రమం రాత్రి పూర్తవగానే, ఆ ఎపిసోడ్ లో ఏం జరిగిందన్న దానిపై టీవీ9 మర్నాటి ఉదయానే ఒక కార్యక్రమం చేసేది. బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరైనా ఎలిమినేట్ అయి వస్తే, వెంటనే వారితో ఒక ఇంటర్వ్యూ చేసేది. ఇవన్నీ బిగ్ బాస్ కార్యక్రమం ప్రేక్షకుల నోళ్ళలో మరింతగా నానేలా చేయడం కోసం అన్నమాట. అయితే టీవీ9 స్క్రీన్ పై అంత సేపు బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రోగ్రాం రావడం అన్నది ఊరికే ఫ్రీ గా అలా జరగదు. దానికోసం బిగ్ బాస్ నిర్వాహకులు టీవీ 9 కి భారీగానే సమర్పించుకోవలసి ఉంటుంది. ఏది ఏమైనా బహుశా ఈ ప్రమోషన్ ప్యాకేజ్ సరిగ్గా అందినంత కాలం టీవీ9 లో బిగ్ బాస్ కార్యక్రమం గురించి పాజిటివ్ కథనాలు రోజువారీగా వచ్చాయి. కానీ ఈ సీజన్ లో మాత్రం బిగ్ బాస్ పై టీవీ9 లో కేవలం నెగటివ్ కథనాలు మాత్రమే వస్తున్నాయి
ఈ సీజన్ లో టీవీ 9 తో ప్రమోషన్ ప్యాకేజ్ లేదా?
అయితే గతంలో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రమోషన్ చేసే ప్రోగ్రాం వచ్చే సమయానికి సంబంధించిన స్లాట్ ఈ సారి ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం తీసుకున్నట్లు గా కనిపిస్తోంది. ప్రతి రోజు ఎవరు మీలో కోటీశ్వరుడు ఎపిసోడ్ అయిపోగానే మర్నాడు టీవీ9 లో ఆ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ హావభావాల గురించి, ఎపిసోడ్ లో జరిగిన సంభాషణల గురించి ఎన్టీఆర్ గత చిత్రాలలోని క్లిప్పింగ్ లు జత చేస్తూ మరీ ఆ కార్యక్రమాన్ని ఊదరగొడుతూ టీవీ9 ప్రోగ్రాం చేస్తుంది. అయితే సరిగ్గా ఇదే స్లాట్ లో గత సీజన్ల లో బిగ్ బాస్ మీద ప్రోగ్రామ్స్ వచ్చేవి. దీన్ని బట్టి ఈ సారి బిగ్ బాస్ నిర్వాహకులు టీవీ9 తో ప్రమోషన్ ప్యాకేజ్ సెట్ చేసుకో లేదేమో అనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో దీప్తి నల్లమోతు, దేవి నాగవల్లి వంటి టీవీ 9 యాంకర్స్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటే, ఈసారి టీవీ9 తరఫున బిగ్ బాస్ లో ఎవరు లేరు.
బిగ్ బాస్ పై టీవీ9 వరుస నెగటివ్ కథనాలు:
ఆ మధ్య లెఫ్ట్ పార్టీకి చెందిన సిపిఐ నారాయణ బిగ్ బాస్ ప్రోగ్రాం ని విమర్శిస్తూ కరుడు గట్టిన రైట్ వింగ్ పార్టీ నాయకుడిలా మాట్లాడారు. దాన్ని టీవీ9 ఛానల్ ప్రముఖంగా ప్రసారం చేయడమే కాకుండా, ” కొంచెం తగ్గించండి బాస్” అంటూ బిగ్ బాస్ పై నెగటివ్ ఇమేజ్ వచ్చేలా ప్రోగ్రాం చేసినట్లుగా కనిపిస్తోంది. కేవలం ప్రమోషన్ ప్యాకేజ్ సెట్ కాకపోవడం వల్లే టీవీ9 బిగ్ బాస్ పై నెగటివ్ కథనాలను ప్రసారం చేస్తోందా అన్న విమర్శలు , సందేహాలు ఈసారి ప్రేక్షకుల నుండి వస్తున్నాయి. కనీసం టీవీ9 లో పని చేసే యాంకర్ ఎవరైనా ఈ సారి హౌస్ లో ఉండి ఉంటే అయినా కొంత వరకు సంయమనం పాటించి ఉండేది ఏమో కానీ, అది కూడా లేకపోవడం వల్ల ఇక ఎటువంటి మొహమాటాలు లేకుండా వరుసపెట్టి ప్రతికూల కథనాలను బిగ్ బాస్ పై టీవీ9 ప్రసారం చేస్తున్నట్లుగా ఉంది అన్న అనుమానాలు ప్రేక్షకులలో కలుగుతున్నాయి
మొత్తానికి టీవీ9 ఏది చేసినా దాని వెనుక ఒక కారణం, అంతరార్థం ఉంటాయన్న విషయం మాత్రం ఇటీవల కాలంలో ప్రేక్షకులకు బాగా అర్థమవుతుంది.