టీవీ9 మాజీ సీఈవో, ఆర్టీవీ న్యూస్ నెట్ వర్క్ చీఫ్ రవిప్రకాష్ మేఘా కృష్ణారెడ్డిపై రోజుకో బాంబు వేస్తున్నారు. తాజాగా ఆయన మేఘా కృష్ణారెడ్డిని హర్షద్ మొహతా 2.0గా పోల్చి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అతి చిన్న టర్నోవర్ తో లక్షల కోట్ల కాంట్రాక్టులను.. నకిలీ బ్యాంకు గ్యారంటీలు పెట్టి పొంది చేస్తున్న అరాచక వ్యాపారంతో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.
నకిలీ బ్యాంకు గ్యారంటీల విషయంలో రవిప్రకాష్ చాలా కాలంగా పోరాడుతున్నారు. ఆర్బీఐకి కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐ సిద్ధమయింది. ఈ సందర్భంగా రవిప్రకాష్ కీలకమైన విషయాలతో ట్వీట్ చేశారు. మేఘా కృష్ణారెడ్డి , యూరో ఎగ్జిమా బ్యాంక్ కలిసి చేస్తున్న ఫేక్ బ్యాంక్ గ్యారంటీల విషయంలో తాను నిజాలను బయట పెట్టినందుకు తనపై వంద కోట్ల పరువు నష్టం దాఖలు చేశారని అయినా నిజాలు బయటపడుతున్నాయన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసే ఈడీ మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు పట్టించుకోవడం లేదని రవిప్రకాష్ ప్రశ్నిస్తున్నారు.
నకిలీ బ్యాంక్ గ్యారంటీలు పెట్టి లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు పొంది.. భారతీయ కాంట్రాక్ట్ సిస్టమ్లో పోటీ అనేది లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అలా పొందిన కాంట్రాక్టులన్నీ నాసిరకకమేనని కూలిపోయిన బ్యారేజీలు.. నీళ్లలో మునిగిపోయిన పంప్ హౌస్లు నిరూపిస్తున్నాయన్నారు. రాజకీయ నేతల్ని సంతృప్తి పరుస్తూ ఆయన చేస్తున్న అరాచకం వల్ల దేశ అభివృద్ధికి గండి పడుతోందని రవిప్రకాష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హర్షద్ మొహతా.. బ్యాంక్ నోట్స్ లో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని బ్యాంకుల సొమ్ముతో స్టాక్ మార్కెట్ వ్యాపారం చేశారు. బ్యాంకుల్ని హర్షద్ మొహతా వాడుకుంటే.. ప్రభుత్వాలను మేఘా కృష్ణారెడ్డి వాడుకుంటున్నారని రవిప్రకాష్ చెబుతున్నారు. లక్షల కోట్ల కాంట్రాక్టులు పొంది.. ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి వేల కోట్ల అడ్వాన్సులు తీసుకుంటున్నారు. కానీ పనులు చేయడం లేదు. వివిధ రకాల అనుమతుల పేరుతో ఆయన కాలయాపన చేస్తున్నారు. ఈ లోపు ప్రభుత్వ డబ్బు మేఘానికి కంపెనీ సొంతానికి వాడుకుంటోంది. ఇంత కన్నా పెద్ద స్కాం ఉండదని.. హర్షద్ మొహతా 2.0 మేఘా కృష్ణారెడ్డి అని రవిప్రకాష్ వాదన. మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్రం ఎప్పుడు ఈ అంశంపై దృష్టి సారిస్తాయో మరి..!