ఇటీవల పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఫంక్షన్లో ఎన్టివి నరేంద్ర చౌదరి,, టీవీ9 రవి ప్రకాశ్ కలసి పాల్గొన్నారు. పవన్‌ను బాగా ప్రశంసించారు. ఇద్దరూ ఆ చిత్రానికి మీడియా భాగస్వాములు గనక ఆ హౌదాలో పాల్గొన్నారని భావించవచ్చు. అయితే ఆ భాగస్వామ్యాన్ని మించి వారిద్దరి కలయిక మరో ఛానల్ రావడానికి కారణమవుతున్నదని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఎన్టివి టీవీ9 కలిస్తే మీడియాలో బాగా ఆధిక్యత నిలబెట్టుకోవచ్చని చౌదరి భావిస్తున్నారట. చాలా వరకూ మొదటి స్థానంలో వుంటున్న టీవీ9ను కూడా కలిపేసుకుంటే ఒక ఎవరి సవాలూ వుండదని కూడా ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఎబిఎన్ పూర్తిగా చంద్రబాబుకు మద్దతుదారుగా మారడం, ఈనాడు మరో విధంగా రెండు రాష్ట్ర సర్కార్లకే గాక మోడీకి కూడా భజన చేస్తుండడం వల్ల ఎవరికి వారు తమ మార్గమేమిటో చూసుకోవలసిన స్థితి ఏర్పడింది. ఎన్టీవీ టీవీ9 కలయిక ఆ నేపథ్యంలోంచే వచ్చిందంటున్నారు.వీరు ఉభయులూ కలసి ఒక మ్యూజిక్ చానల్ తెస్తారట. అది కూడా ఎన్టివి ప్రాంగణంలోనే. ఇది ఖరారు చేయడానికి రవి ప్రకాశ్ వారానికి ఒకటి రెండు సార్లు ఎన్‌టివిని సంరదర్శిస్తున్నట్టు సమాచారం.
టీవీ 9 స్టేక్స్ అమ్మకంపై చాలా కాలంగా కథనాలున్నాయి. కాని ఇంకా తేలినట్టు లేదు. ఏది ఏమైనా రవి ప్రకాశ్‌కు తన వాటాలు వుంటాయి. అయితే తనకంటూ ఒక వ్యవస్థ వుంటే మంచిదని ఆయన ఆలోచనగా చెబుతున్నారు.అందుకే తన తర్వాత బలమైన ఎన్టీవీతో కలసి ఏదైనా చేయాలని ఆలోచించారు. ఎపిలో కూడా వెంకట కృష్ణ ఛానల్థో పాటు రవి ప్రకాశ్ ద్వారా మరో ఛానల్ పెట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇక ఈ రేసులో కొంచెం దెబ్బతిన్న టీవీ5 తన తరహా భక్తి ఛానల్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. కొద్దికాలంలోనే మన మీడియా దృశ్యం చాలా మారవచ్చు. సిపిఐ ప్రారంభించిన టీవీ99 కొనవూపిరితో నడుస్తున్నది. దాన్ని ఇప్పటిలా రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణకు వదిలేయకుండా తెలరగాణ సిపిఐ తీసుకోవాలని నిర్ణయించారట. అయితే దాంతోనే ఆ ఛానల్‌కు పెద్ద శక్తివస్తుందని చెప్పలేము గాని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇటీవలి రేటింగ్ గజిబిజి తర్వాత టీవీ5 కొంత అసౌకర్యంగా వుంది. సాక్షి పెద్దగా ముందుకు వచ్చింది లేదు గాని దాని పెరుగుదల శాతం ఒక వారం అన్నిటికన్నా ఎక్కువగా నమోదైంది. గతంలో పెద్ద ఆకర్షణగా వున్న వి6 వెనకబడగా కేబుల్ ఆపరేటర్లపై పెట్టుబడి పెంచిన ఆంధ్రజ్యోతి వేగం పుంజుకున్నది.10 టీవీ స్థిరంగా ముందుకు పోతున్నది. దానిలో జీతాలు ఇవ్వడం లేదని ఒక పెద్ద ప్రచారం జరుగుతుండగా ఒక నెల తప్ప అన్నీ ఇచ్చేశామని నిర్వాహకులు తెలిపారు.