మైహోం రామేశ్వరరావుకు కేసీఆర్తో చెడిందనే ప్రచారం ఓ వైపు జరుగుతూండగానే.. ఆయన చానల్ టీవీ9లో టీఆర్ఎస్ పనైపోయిందన్నట్లుగా వార్తలు రాస్తున్నారు. టీఆర్ఎస్ వరి ధర్నాలకు కవరేజీ తక్కువగా ఇస్తూ.. బీజేపీ కార్యక్రమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. పనిలో పనిగా.. టీఆర్ఎస్లో తిరుగుబాటువస్తోందని కొన్ని నియోజకవర్గాలను ప్రస్తావిస్తూ కథనాలు రాస్తున్నారు. ఇటీవల భిక్షమయ్య గౌడ్ అనే మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. అదే సందుగా .. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారాన్ని టీవీ9 ఉద్ధృతం చేసింది.
బీజేపీ వేగంగా పుంజుకుంటోందని అందుకే ఆ పార్టీలోకి పెద్ద ఎత్తున నేతలు వెళ్తున్నారన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు టీవీ9 ప్రస్తుతం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టీవీ9 ఎడిటోరియల్ పాలసీ ఒక్క సారిగా ఇలా మారిపోవడం వెనుక ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నాళ్లుగా రామేశ్వరరావు కేసీఆర్కు దూరంగా జరుగుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఓ సారి ఆయన కంపెనీలపై దాడులు చేసిన తర్వాత ఆయన మెల్లగా దూరం జరిగారు. బీజేపీకి దగ్గరయ్యారు. ఈ విషయం కేసీఆర్ గ్రహింపునకు వచ్చాక ఆయనను దూరం పెట్టడం ప్రారంభించారు.
ఇప్పుడు వారి మధ్య పూర్తి స్థాయిలో దూరం పెరిగినట్లుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఆయనకూ పూర్తిగా వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తట్టుకోవడం కష్టమే. ఎందుకంటే.. కేసీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకునే గతంలో టీవీ9ని రామేశ్వరరావు సొంతం చేసుకోగలిగారు. ఇప్పుడు కేసీఆర్కు పూర్తి స్థాయిలో ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలుసు.. అందుకే కాస్త బ్యాలెన్స్డ్ గా ఉంటున్నారని.. కేసీఆర్ పరిస్థితి బాగోలేదని పూర్తి స్థాయిలో నిర్ధారణకు వస్తే.. టీవీ9లో కేసీఆర్పై దారుణమైన వ్యతిరేక కథనాలు రావడం ఖాయమని అంచనాలు వినిపిస్తున్నాయి.