టీవీ 9 రజనీకాంత్ ఇక కొంత కాలం స్క్రీన్ పై కనిపించే అవకాశం లేదు. ఆయనను సెలవు పెట్టి వెళ్లిపోవాలని యాజమాన్యం ఆదేశించింది. ఇప్పటికే ఆయన ఎలాంటి చర్చా కార్యక్రమాలు పెట్టవద్దని స్పష్టం చేయడంతో మంగళవారం టీవీ9లో స్టోరీలతో ప్రైమ్ టైమ్ నిలిపివేశారు. చర్చలు పెట్టలేదు. తాజాగా ఆయన చానల్ రోజువారీ వ్యవహారాలు కూడా చూడాల్సిన అవసరం లేదని సెలవుపై వెళ్లాలని స్పష్టం చేసింది. దాంతో ఆయన వారం రోజుల పాటు సెలవుపై వెళ్తున్నట్లుగా సన్నిహితులకు సమాచారం ఇచ్చారు.
టీవీ9 ఇంత కాలం అధికార పార్టీలకు చేసిన ఊడిగం కారణంగా.. మొన్నటిదాకా ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు అధికార పార్టీలకు పీకల మీద దాకా కోపం ఉంది. అనేక వ్యాపారాలు చేస్తున్న ఈ చానల్ యజమానులకు ప్రభుత్వాలు కన్నెర్ర చేస్తే కొల్లెటరల్ డ్యామేజీ జరుగుతుంది. దీన్నుంచి తప్పించుకోవాలంటే.. ఇప్పుడు వారికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ .. రజనీకాంత్ ను తప్పించడం.
రవిప్రకాష్ చేతి నుంచి చానల్ చేజారిపోయిన తర్వాత రజనీకాంత్ బ్యాటన్ అందుకున్నారు. మైహోమ్ ఓనర్ల మనసు దోచి రవిప్రకాష్ ప్లేస్ ఆక్రమించేసుకున్నారు. జర్నలిజంలో కనీస పరిజ్ఞానం ఉండదని ఆయన తో మాట్లాడిన ఎవరికైనా తెలిసిపోతుందని ఆ కాంపౌండ్లో సెటైర్లు పడినా… యజమానులకు కావాల్సిన జర్నలిజం ఇవ్వడంలో సిద్ధహస్తుడు. అందుకే ఆయన కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు కూడా తనకు తెలిసిన టీడీపీ నేతలతో కలిసి రాజీ ప్రయత్నాలు చేసినా.. గతంలోలా పరిస్థితులు లేకపోవడంతో రజనీకాంత్ కు గడ్డు పరిస్థితులు తప్పడం లేదు.