” ఐ వాంట్ దిస్ అతి..” ఓ సినిమాలో టీవీ చానల్ క్రియేటివ్ హెడ్‌గా ఉండే బ్రహ్మానందం డైలాగ్ చెబుతూ ఉంటాడు. న్యూస్ చానల్స్‌లో అతి మాత్రమే వర్కవుట్ అవుతుందని ఆయన ఫీలింగ్. ఇప్పుడు టీవీ9 కూడా అంత కంటే ఎక్కువ “అతి”ని చూపిస్తూ… తాము ఓ మెట్టు ఎక్కువే ఉంటామని నిరూపించుకుంటోంది. కనీసం బేసిక్స్ తెలియకుండా స్టోరీలు రాయడం… సినిమా బిట్లు వాడేసుకుని లేనిపోని భయోత్పాతాల్ని సృష్టించే ప్రయత్నం చేయడం.. ఈ అతిలో భాగం. అమెరికాలో మంచు సీజన్‌పై పదకొండు నిమిషాలకుపైగా ఉన్న కథనం అతిలో సరికొత్త పీక్స్‌కి చేరినట్లయింది. కనీసం అమెరికాలో మంచు విలయం సృష్టిస్తున్న ఊళ్ల పేర్లు కూడా స్పష్టంగా తెలియకుండా స్క్రిప్ట్ రాసేశారు.
అమెరికా అంటే భూతల స్వర్గం అని .. మంచు వల్ల ఇప్పుడు నరకంగా మారిపోయిందని టీవీ9 తేల్చేసింది. అమెరికాలో 70 శాతం మంది ప్రజలకు తిండి, నీళ్లు, కరెంట్ లేవట. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వస్తే ప్రాణాలు దక్కవట. ఇలా చెప్పుకుంటూ పోతే… స్క్రిప్ట్ లోనే.. అతిలోనే అతి కనిపిస్తూ ఉంటుంది. సినిమా బిట్లు వాడుకుని… తాము చెప్పిన స్క్రిప్ట్‌కి తగ్గట్లుగా దృశ్యాలు వేసే ప్రయత్నం చేశారు కానీ.. అది కూడా తెలిపోయింది. ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని… చావుకు దగ్గర్లో ఉన్నారని చెబుతున్నప్పుడు.. ఆ కథనం మొత్తంలో కనిపించిన దృశ్యాలు… మంచులో జనం ఆడుకుంటున్నవి. మంచు ముద్దలతో ఆడుకోవడం… స్కేటింగ్ చేయడం వంటివి జనం చేస్తున్న దృశ్యాలు చూపిస్తూ… అక్కడే జనం మంచు దెబ్బకు చచ్చిపోబోతున్నారని .. చెప్పుకొచ్చారు.
అమెరికాలో ఎంత మంది జనాభా ఉంటారో స్క్రిప్ట్ రాసిన వాళ్లకు తెలుసో లేదో కానీ ఏకంగా 70 శాతం మంది మంచులో కూరుకుపోయారని తేల్చేశారు. అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో మంచు ప్రతీ ఏడాది విలయం సృష్టిస్తూ ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వాలు… ప్రత్యేకమైన జాగ్రత్తలుతీసుకుంటాయి. రోజుల తరబడి కరెంట్ ఉండని సందర్భాలు ఉంటాయి కాబట్టి.. ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇండియాలోలాగా.. ఏమీ చేయకుండా అన్నీ చేసేశామని… ప్రపంచమంతా మా వైపు చూస్తోందని చెప్పుకోవడానికి అక్కడ రాజకీయ నేతలు ఆసక్తి చూపించరు. ప్రజలకు ఏం కావాలో అది చేయడానికే ప్రయత్నిస్తారు. ప్రపంచం వాళ్ల వైపు చూస్తోందో లేదో కానీ .. వారు మాత్రం ప్రజల వైపు చూస్తారు.
ప్రతీ దేశంలోనూ ప్రకృతి విపత్తులు వస్తాయి. అది కామనే. అంత దానికే అమెరికా అంతా మంచులో శిథిలం అయిపోయిందని.. అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులు .., ప్రాణభీతితో ఉన్నారని.. ఇక్కడ వారి కుటుంబాల్ని భయపెట్టే ప్రయత్నం చేయడం తప్ప…అంతకు మించి అతి.. ఆ స్టోరీలో లేదు. ఆ మాటకు వస్తే… దేవినాగవల్లి ప్రజెంట్ చేస్తోన్న సూపర్ ప్రైమ్ టైమ్‌కి ఈ అతి అనేదాన్ని.. ప్రత్యేక అర్హతగా నిర్ణయించుకున్నట్లుగా ఉన్నారు. అనేక సార్లు ఆమె చదివే యాంకర్ పార్ట్ కూడా… సోషల్ మీడియాలో ట్రోల్ అయింది.