రాజకీయాలు మారాయి. ఆధునికతను సంతరించుకున్నాయి. డబ్బు , మందిమార్బలంతో హడావిడి చేయడం , సోషల్ మీడియాలో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం..ఒకటి చేస్తే రెండు చేసినట్లు కలరింగ్ ఇచ్చుకోవడం. ఇవి ప్రస్తుత రాజకీయల్లో కనిపించే ట్రెండ్. వీటిని కాదని, మూస ధోరణిలో రాజకీయాలు చేస్తే వర్కౌట్ అవ్వడం కష్టమే. ఇక, కొత్తగా ఏర్పాటైన పార్టీలు అయితే వీటిని పక్కాగా ఫాలో అవుతున్నాయి. ఆ లీడర్లు కొత్త పంథాలో రాజకీయాలు చేస్తున్నారు.
తమిళనాట పార్టీ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ అధ్యక్షుడు, స్టార్ హీరో విజయ్ ఇంకా మూస ధోరణిలో రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్బంగాచెన్నై పాలవాక్కంలో నివాళులర్పించారు. అయితే, ఆయన ఎలాంటి ఆడంబరాలు లేకుండానే అక్కడికి వచ్చి తనతో పాటు తెచ్చుకున్న పూలమాల అంబేడ్కర్ విగ్రహానికి వేసి వెళ్లిపోయారు. ఇది చూసి వారెవ్వా…ఏం సింప్లిసిటీ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరో ఇంత సింపుల్ గా వ్యవహరించడం చూసి కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇక్కడే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయ్ పార్టీ ఏర్పాటు చేసి ఏడాది కూడా అవ్వలేదు. ఆయన పార్టీ సిద్ధాంతాలు, విధానాలు ఇంకా జన బహుళ్యంలోకి వెళ్లలేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆయన నివాళులు అర్పించడం కాదు..ఓ నాలుగు మాటలు మాట్లాడాలి. రాజ్యాంగ విలువలను ప్రజలకు వివరించి దగ్గరవ్వాలి. ఎన్నికలు కూడా ఏడాదిలోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సింప్లిసిటీకి ప్రధాన్యత ఇస్తే ఎవరూ యాక్సెప్ట్ చేయరు. నలుగురు చప్పట్లు కొట్టొచ్చు కానీ, ఇవే ఓట్లు తెచ్చి పెట్టలేవు. పైగా…అసమర్థత అనుకునే ప్రమాదం ఉంటుంది.
జనాల్లోకి ఇలాంటి సమయంలోనే ఓ రూట్ మ్యాప్ తీసుకొని వెళ్లాలి. కానీ, విజయ్ ఆ ప్రయత్నం చేయడం లేదన్నది స్పష్టం అవుతోంది. అదే విజయ్ పార్టీకి మైనస్ కావొచ్చునని అంటున్నారు. అయితే, రానున్న రోజుల్లో విజయ్ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.