ప్రకాశం జిల్లాలోని కందుకూరు మండలం చెర్లోపాళెం వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుట్లూరు మండలంలోని చేవూరు నుంచి మాలకొండ వెళుతున్న డి.సి.ఎం. వ్యాన్ ఎదురుగా వస్తున్న శ్రీ కృష్ణ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సుని డ్డీ కొనడంతో రెండు వాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో పడ్డాయి. విచిత్రం ఏమిటంటే బస్సులో డ్రైవర్ మినహా ప్రయాణికులెవరూ లేరు కానీ డి.సి.ఎం. వ్యాన్లో 40 మంది పెళ్లి బృందం ప్రయాణిస్తున్నారు. వారిలో 12 మంది అక్కడే మరణించగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలినవారికి కూడా గాయలయినప్పటికీ వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. రెండు వాహనాలు కాలువలో పడినపుడు బస్సుకి మంటలు అంటుకొని దగ్ధమయిపోయింది. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు, అధికారులు సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకొని గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. సరకు రవాణా చేసే వాహనాలలో జనాన్ని తరలించటం తప్పని ఒక వాదన వినబడుతుండగా, శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సును క్లీనర్ నడుపుతుండటంవల్లే ప్రమాదం జరిగిందని డీసీఎమ్లోని పెళ్ళిబృందంవారు ఆరోపిస్తున్నారు.