టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఎట్టకేలకు పూర్తయింది. అభ్యర్థులుగా సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ లను పార్టీ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి, సీఎం రమేష్ పేరు మొదట్నుంచీ వినిపిస్తున్నదే. ఆయన మరోసారి తన స్థానాన్ని దక్కించుకుంటారని అనుకున్నదే. కానీ, అనూహ్యంగా తెరమీదికి వచ్చారు.. కనకమేడల రవీంద్ర కుమార్. ఈయన వర్ల రామయ్య స్థానంలో వచ్చారనే అనుకోవచ్చు! ఎందుకంటే, రెండో అభ్యర్థిగా రామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. పైగా, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందస్తుగానే కృతజ్ఞతలు కూడా తెలిపినట్టు మాట్లాడారు. కానీ, అనూహ్యంగా రవీంద్ర తెరమీదికి వచ్చారు.
ఇంతకీ, రవీంద్రకుమార్ ఎవరంటే… దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన తెలుగుదేశం పార్టీకి న్యాయ సేవలు అందిస్తూ వస్తున్నారు. లీగల్ సెల్ అధ్యక్షుడిగా చాన్నాళ్లుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు, ఆ తరువాత తలెత్తిన విభజనకు సంబంధించిన కేసులను ఆయనే వాదిస్తున్నారు. అంతేకాదు, పదేళ్లపాటు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఈయన న్యాయపరంగా పార్టీకి అండగా నిలిచారు. ఆ సమయంలో టీడీపీపై వచ్చిన కేసుల్ని ఈయనే వాదించారు. పైగా, త్వరలో విభజన హామీల నేపథ్యంలో త్వరలో న్యాయ పోరాటానికి దిగే ఆలోచనలో టీడీపీ ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి కదా. ఈ నేపథ్యంలో ఆయన పేరును రాజ్యసభ అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
విభజన హామీలూ వివాదాలపై సమగ్ర అవగాహన ఉన్న రవీంద్రకుమార్ రాజ్యసభలో ఉంటే బాగుంటుందని సీఎం భావించారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇదే విషయం వర్ల రామయ్యకు వివరించి నచ్చజెప్పే ప్రయత్నం జరిగిందని తెలుస్తోంది. ఇక, సీఎం రమేష్ కు మరోసారి అవకాశం కల్పించడం ముందు నుంచి ఊహించిందే. మొత్తానికి, అత్యంత ఉత్కంఠ రేపిన టీడీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక ఇలా పూర్తయింది. అయితే, ఈ రేసులో చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించాయి. మరీ ముఖ్యంగా ఆర్థికమంత్రి యనమల కూడా రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టూ కథనాలు వచ్చాయి. అయితే, రాష్ట్రానికి ఆయన సేవలు అవసరం చాలా ఉందన్న కోణంలో యనమలకు చంద్రబాబు నచ్చజెప్పి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.