ఏపీకి ప్రత్యేక హోదాపై తలెత్తుతున్న అనుమానాలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెరదించే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ లో ప్రణాళికా శాఖమంత్రి ఇందర్ జిత్ సింగ్ చేసిన ప్రకటన బీహార్ కు సంబంధించినదేతప్ప, అది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినది కాదని మీడియా ఎదుట ఇవ్వాళ నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. బీహార్ ను ఆంధ్రప్రదేశ్ తో కలిపిచూడలేమన్నారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉంటామనీ, దీనిపై ఎలాంటి సందేహాలుపెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆమె వివరణఇచ్చారు. మీడియా లేనిపోని రాద్ధాంతాలు చేయకుండా ఉండేందుకే వివరణ ఇచ్చినట్టు ఆమె ఆఫ్ ద రికార్డ్ గా చెప్పారు.
కొద్దిరోజుల కిందట, పార్లమెంట్ లో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్రమంత్రి ఇంద్రజిత్ సమాధానం చెబుతూ, బీహారుకు కూడా ప్రత్యేకప్యాకీజీ ఇవ్వడం జరిగిందేతప్పించీ, ప్రత్యేకహోదా ఇవ్వలేదని చెప్పడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కే అన్న సంకేతాలు పాతుకుపోయాయి.
కాగా, తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా వచ్చేవరకు పోరాటం ఆపమనీ, ప్రత్యేకహోదాకంటే తమకు ఎంపీ పదవి ముఖ్యంకాదనీ, అవసరమనుకుంటే పదవికి రాజీనామాచేసి పోరాడతామని చెప్పారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదేవిషయంపై మాట్లాడుతూ, 14వ ఆర్థికసంఘం నివేదిక ఆధారంగానే పార్లమెంట్ లో కేంద్రం ప్రకటన చేసిందని, ప్రత్యేక హోదా విషయంలో ఏపీది ప్రత్యేక పరిస్థితని గుర్తుచేశారు. అసమగ్ర విభజనచేసి రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టారనీ, అన్ి రాష్ట్రాలతో పోటీపడేస్థాయికి వచ్చేవరకు కేంద్రం సహకరించాల్సిందేనని ఇందుకోసం తుదివరకు పోరాడతామని బాబు తేల్చిచెప్పారు. మరోపక్క ఏపీకి ప్రత్యేక హోదా కోసం దాదాపు అన్ని పార్టీల్లో కదలికవచ్చింది. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా వివిధపార్టీల నాయకులు చెబుతున్నారు. అయితే, ఈ అనుమానాలను స్వయంగా ప్రధానమంత్రే పార్లమెంట్ లో నివృత్తిచేయాలని పలువురు కోరుకుంటున్నారు.