ఫామ్ హౌస్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్ ను విచారించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కు నాంపల్లి కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలకు ప్రయత్నం చేసిన కేసులోనే ఈడీ నందకుమార్ ను ప్రశ్నించనుంది. రెండు రోజుల పాటు విచారణ కు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే క్రిస్మస్ సెలవులు ఉన్నందున ఈ నెల 26, 27 న నందు కుమార్ ను చంచల్ గూడ జైల్లోనే ప్రశ్నించనున్నారు.
తాను బీజేపీలో చేరితే వంద కోట్లు ఇస్తానని.. నందకుమారే ప్రలోభపెట్టారని..నంద కుమార్ వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకే ప్రస్తుతం కేసు నడుస్తోంది. సిట్ దర్యాప్తు ప్రస్తుతం నిలిచిపోయింది. ఏసీబీ దర్యాప్తు చేయాలా.. సిట్ చేయాలా అన్నదానిపై హైకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. అయితే నందకుమార్ అసలు రోహిత్ రెడ్డి బిజినెస్ పార్టనర్ అన్న విషయాలు ఇటీవల వెలుగు చూశాయి. ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఈడీ పలువుర్ని ప్రశ్నిచింది. ఇప్పుడు నందకుమార్ ను ప్రశ్నించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.