కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా మారాయి. రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ శక్తిగా భాజపా అవతరించింది. దాదాపు 104 స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి 78 స్థానాల అంకె దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఇక, మొదట్నుంచీ రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టుగానే.. రాష్ట్రంలో కీలకమైన రాజకీయ శక్తిగా జేడీఎస్ అవతరిస్తోంది. మొత్తం 38 సీట్లతో నిర్ణయాత్మకంగా జేడీయస్ పాత్ర మారింది. నిజానికి, ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తే.. ఒక దశలో భాజపాకి పరిపూర్ణ మెజారిటీ లభించినట్టు ఆధిక్యత ప్రదర్శించింది. ఆ సమయంలో భాజపా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కనిపించింది. కానీ, రానురానూ కాంగ్రెస్ కొంత పుంజుకోవడంతో… హంగ్ దిశగా అడుగులు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు జేడీఎస్ కు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా తమ పరిపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ప్రకటించారు. ఈ సాయంత్రమే రెండు పార్టీల నేతలూ గవర్నర్ ను కలిసి, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు జేడీఎస్ నేతలు కుమారస్వామి, దేవెగౌడలతో ఫోన్ లో చర్చలు జరిపినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్ణాటకలో కీలక రాజకీయ శక్తిగా భాజపా అవతరించింది. వందకు పైగా స్థానాలకు కైవసం చేసుకుని దక్షణాదిన బలమైన పునాదులు పడ్డాయనే సంకేతాలు ఇస్తోంది. అయితే, కాంగ్రెస్, జేడీఎస్ ల కలయిక వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం భాజపాకి దక్కకపోవచ్చు. కానీ, దక్షిణాదిన తాము సాధించిన విజయంగానే ఈ ఫలితాలను భాజపా ప్రచారం చేసుకుంటుంది. ఉత్తరాది పార్టీ అనే ముద్ర తమపై తొలగిపోయిందనే ప్రచారం ఇప్పటికే ఆ పార్టీ నేతలు మొదలుపెట్టేశారు. మొత్తానికి, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన మాట వాస్తవం.