కేంద్రంలోని నరేంద్ర మోడి ప్రభుత్వంలో విదేశాంగ, రైల్వే లాంటి రెండు మూడు శాఖల్లో ట్విట్టర్ ద్వారా వచ్చే విన్నపాలకి సత్వర పరిష్కారం లభించడం, అలాంటి పరిష్కారాలకి బాగా పబ్లిసిటి రావడం చూసి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రజల సమస్యల్ని ట్విట్టర్ దర్బార్లో స్వీకరించడం,సత్వరమే దాన్ని పరిశీలిస్తున్నాం అని గాని,పరిష్కరించేసినట్లుగా హామీ ఇచ్చినట్టు గాని తరచూ వార్తల్లో కనిపించేట్టు చూసుకుంటున్నారు కొత్తగా. హైటెక్ పద్దతిలో జనం విన్నపాలు తమ దృష్టికి వస్తే పరిష్కరించడం అనేది మంచిదే, మొత్తం వ్యవహారాన్ని అభినందించాల్సిందే.అయితే సామాన్యుల మాట ఏమిటి,సర్కారు వారు కేవలం హైటెక్ బాటలో తమ దృష్టికి వస్తున్న బాధలను మాత్రమే వెంటనే పట్టించుకుంటారా? పేదవారికి అవే కష్టాలు ఉంటే వాటికి ద్వితీయ లేదా చివరి ప్రాధాన్యమేనా? అనే ప్రశ్నలు అడిగేవారు కూడా లేని ప్రస్తుత పరిస్థితిలో ఆ ప్రశ్నలు పక్కన పెట్టి..నేతల్లో ఉన్న ఈ పబ్లిసిటి కోరికలని గ్రహించి దాన్ని కొందరు ట్విట్టర్ పౌరులు ఎలా వాడేసుకుంటున్నారో చూద్దామా ?
తాజాగా… కవితా రావు అనే “టివి9 తెలంగాణ” జర్నలిస్టు ఏమి ట్వీట్ చేసింది అంటే.. ఆమె ఉండే మధురానగర్(హైదరాబాదు) ఏరియాలో గత వారం నుంచీ ఎక్కువ పవర్ కట్లు వున్నాయంట,అవి చూసి ఆమె ఏడు ఏళ్ళ కూతురు “ఆ పవర్ కట్లు కి పరిష్కారం కావాలంటే కేటీఆర్ అంకుల్ కు ట్వీట్ చెయ్యి అమ్మా” అని తనతో అన్నది అని కేటీఆర్ కి తెలియజేస్తూ ఆ తల్లి (“టివి9 తెలంగాణ” జర్నలిస్టు)ట్వీట్ చేసింది. సరే ఆమె ఏడు ఏళ్ళ కూతురుకి అంతటి రాజకీయ పరిపక్త్వత ఉందా ? లేక ఈ జర్నలిస్టు కేటీఆర్ గారిని కాకా పట్టడానికి మంచి బిస్కెట్ వేసిందా? అనేది పక్కన పెట్టేద్ధాము. అయినా కామెడి కాకపోతే సర్కారుకు తెలియకుండానే, సర్కారు అనుమతి లేకుండానే రెగ్యులర్ పవర్ కట్ లు జరుగుతాయా ? అది కేటీఆర్ గారికి అప్పుడే మనం చెప్పే దాకా తెలియదన్నట్టు, అటు ట్విట్టర్ పౌరులు, ఇటు నేతలు బాగా రక్తి కట్టిస్తున్నారు.
ఇదిగో ఆ ట్వీటు :
Regular power cuts at Madhura Nagar since a week, my 7 year old daughter saying amma tweet it n add it to @KTRTRS uncle,he will look into it
— kavitha Rao (@iamKavithaRao) April 16, 2016