రెండున్నరేళ్ల కిందట ఏపీలో ఎలా ఉండేది ?
అంతా బాగుండేది. పరిశ్రమలకు పరిశ్రమలు వచ్చేవి. సంక్షేమానికి సంక్షేమం జరిగిపోయేది. ప్రాజెక్టులు.. అభివృద్ధి పనులు పరుగులు పెట్టేవి. ఉద్యోగులకు రావాల్సినవి సరైన సమయానికే వచ్చేవి. ఐదేళ్లలో కనీసం ఆర్టీసీ చార్జీలు కూడా పెంచలేదు. ఎంతో లోటు బడ్జెట్‌తో ప్రారంభమైనప్పటికీ ఆ లోటు తగ్గించుకుంటూ ఏ ఒక్క వర్గమూ రోడ్డెక్కకుండా చూసుకోవడంలో ప్రభుత్వంలో సక్సెస్ అయింది. ఇక కలల రాజధాని అమరావతి శరవేగంగా నిర్మాణం అవుతూ ఉండేది. ఇరవై నాలుగు గంటలూ మూడు షిప్టుల్లో వేల మంది పని చేస్తూ ఉండేవారు. అందరికీ పనులు దొరుకుతూ ఉండేది. కానీ ఒక్కటే సమస్య ఉండేది.. అదే కుల చిచ్చు. కులం..కులం..కులం అని ఓ కులం మీద తప్పుడు ప్రచారాలన్నీ చేశారు. కడుపు నిండిన వాడికి .. కష్టం తెలియని వాడికి కులమే సమస్యగా కనిపించింది. దాని ఫలితంగా జాతకమే తిరగబడింది.
రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడెలా ఉంది ?
జీతాలు తగ్గించారని ఉద్యోగులు రోడ్డెక్కారు. ఓటీఎస్ పేరుతో రూ. పదివేలు వసూలు చేస్తున్నారని పేదలు గగ్గోలు పెడుతున్నారు. కరెంట్ చార్జీలు మూడింతలయ్యాయని వినియోగదారులు మథనపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ దేశంలోనే అత్యధికంగా ఉన్నా కనికరించేవారు. ఇసుక బంగారం అయిపోయింది. అన్ని వ్యాపారాల మీద దెబ్బకొట్టేశారు. చివరికి సినిమా ధియేటర్లనూ మూసేసుకోవాల్సి వచ్చింది. మద్యం అలవాటు ఉన్న పేదలను పీల్చి పిప్పి చేస్తూ ప్రభుత్వం పండగ చేసుకుంటోంది. అమరావతి శిథిలం అయిపోయింది. పోలవరం అగిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. అరంధతి సినిమాలో అదేదో వైరస్ రాక ముందు.. వచ్చిన తర్వాత అని చూపించినట్లుగా దృశ్యాలు కళ్ల ముందు కనబడతాయి. కానీ గతం గతమే.. ఇప్పుడు జరిగేదే వాస్తవం. కానీ ఈ వాస్తవానికి అసలు కారణం ఎవరు అన్నదానిపై విశ్లేషణ చేసుకుంటేనే రేపు కాస్త మెరుగ్గా ఉండగలుగుతాం !
విభజన జరిగి ఏడేళ్లయిన తర్వాత బీద అరుపులేంటి !?
రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్లయిపోయింది. విభజన జరిగినప్పుడే ఉద్యోగులకు ఏకంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. ఐదేళ్ల పాటు అన్ని డీఏలూ.. హెచ్ఆర్ఏ..సీసీఏలు సహా అన్నిరకాల అలవెన్స్‌లు .. అమరావతికి వచ్చి పని చేసే వారికి నివాస సౌకర్యం ఇలా అన్నీ కల్పించింది. అప్పుడు ప్రభుత్వానికి భారం కాలేదు. అప్పట్లో ప్రభుత్వం కూడా అప్పులు విచ్చలవిడిగా చేయలేదు. ఏడాదికి సగటున రూ. ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే అప్పులు చేశారు. కేంద్రం నుంచి చట్టపరంగా వచ్చేవే తప్ప కొత్తగా ఏమీ రాలేదు. అయినా ప్రభుత్వం చక్కగా నడిచింది. కానీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలివ్వడానికే విభజన సమస్యలనీ.. కరోనా అని.. ఎందుకు కారణం చెబుతున్నారు ? ఆదాయం ఎందుకు లేదు ? వచ్చిన సొమ్ములన్నీ ఏమవుతున్నాయి..? చేస్తున్న అప్పులన్నీ ఎటు పోతున్నాయి ?. ఒక్క విషయంలో అయినా ప్రభుత్వం పారదర్శకత పాటిస్తోందా ?
జీతభత్యాల భారం.. పాలకుల తెలివి తక్కున నిర్ణయాల ఫలితం కాదా!?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీత, భత్యాల ఖర్చు చాలా ఎక్కువ అని వచ్చిన ఆదాయం అంతా జీతభత్యాలకే పోతోందని లెక్కలు చెబుతోంది. నిజానికి ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో తేడాలున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ఈ దుస్థితికి కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదు కానీ ఉద్యోగుల్ని మాత్రం విలీనం చేసి పడేశారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల జీతాల భారం ప్రభుత్వంపైనే పడింది. అంటే ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న సొమ్ము ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలకు ఇస్తున్నారు. ఇది నెలకు ఆరు వందల కోట్ల వరకూ ఉంటోంది. నిజానికి ఏ సంస్థలో అయినా ఉద్యోగులకు జీతాలు ఇతరులు చెల్లించరు. ఆ సంస్థే చెల్లిచాలి. కానీ ఏపీలో మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు భారంగా మారింది. ప్రభుత్వం జీతాల బిల్లు పెరగడానికి అసలైన కారణాలు చెప్పడం లేదు. ఆర్టీసీ ఉద్యోగులుకు మాత్రమే కాదు.. వాలంటీర్లు, పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా పెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల్లో నియమించి నఉద్యోగుల జీతాల బిల్లు కూడా కలిపి వస్తోంది. నిజానికి ఆ వ్యవస్థలు పెట్టక ముందు కూడా అన్నీ సక్రమంగా సాగుతున్నాయి. అవి వచ్చిన తర్వాతే ఎవరు ఏ పని చేయాలన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఆ వ్యవస్థలతో నెలకు కనీసం రూ. వెయ్యి కోట్ల వరకూ అదనపు ఖర్చు వస్తోంది. వైసీపీ తరపున ప్రజల్ని బెదిరించడానికి ఈ రెండు వ్యవస్థల్ని రూ. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడేమయింది.. మొత్తానికే మోసం వస్తోంది.
ఆర్థిక వనరుల్ని కూలగొట్టి ఆదాయం తగ్గిపోయిందని గగ్గోలు పెడితే ఎలా ?
ఓ కుటుంబం ఆదాయ, వ్యయాల్ని ఎలా లెక్క చూసుకుంటుందో ప్రభుత్వం కూడా అలా చూసి ఖర్చు పెట్టాలని.. ఆదాయ వ్యయాలను చూస్తే ఉద్యోగులకు అంత ఖర్చు పెట్టలేమని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. ఈ తెలివి తేటలు రెండున్నరేళ్ల ముందే ఉంటే ఈ సమస్యలు వచ్చేవికాదు కదా అనేది సగటు సామాన్యుడికి వచ్చే ప్రశ్న. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా ఇబ్బడి మబ్బడిగా అప్పులు చేయడమే కాదు… రాష్ట్రానికి ఆదాయం అందించే ఆర్థిక వనరుల్ని నిలువుగా నరికేశారు. అందులో మొదటిది అమరావతి. అమరావతిని ఆపేయడంతో రూ. పది లక్షల కోట్లు .. చంద్రబాబుకు నష్టం జరిగిందని అప్పట్లో విజయసాయిరెడ్డి వంటి వారు చంకలు గుద్దుకున్నారు. వాస్తవం ఏమిటంటే ఆ నష్టం జరిగింది చంద్రబాబుకు కాదు.. ప్రజలకు.. రాష్ట్రానికి. ఇప్పుడు అమరావతిలో భూముల్ని గజానికి రూ. ఇరవై వేల చొప్పున అమ్మకానికి పెట్టింది అమరావతి అనే బ్రాండ్‌నేమ్‌తోనే . కానీ ప్రభుత్వాన్ని నమ్మేవారు లేక.. కొనేవారే కనిపించడం లేదు. ఒక్క అమరావతి మాత్రమే కాదు.. రాష్ట్రంలో అభివృద్ది పనులు నిలిచిపోయాయి. మౌలిక సదుపాయాలు లేవు. ఇసుక, సిమెంట్ అందుబాటు ధరల్లో ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఓ ఆర్థిక వాహకం. కానీ ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో రియల్ ఎస్టేట్ క్షీణించిపోయింది. ఫలితంగా హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు రెండింతలయ్యాయి. అమరావతిలో హౌసింగ్ ప్రాజెక్టులు కట్టాలనుకున్న వారంతా ఎక్కడివక్కడ ఆగిపోయారు. నిజానికి ఏపీలో ఎన్ని వ్యాపార కార్యకలాపాలు జరిగితే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది. కానీ వాటినే నిట్ట నిలువుగా నరికేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇక ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుంది.
రూ. లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారు..!?
ఏపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో రూ. లక్ష కోట్లకుపైగా అప్పులు చేసింది. ఆ పరంపర అలా సాగుతూనే ఉంది. కార్పొరేషన్లు పెట్టి.. మద్యం రేట్లు పెంచేసి.. భూములు తనఖా పెట్టి.. ఇలా అడ్డగోలుగా వడ్డీ ఎంత అని కూడా చూడకుండా.. కన్సల్టెంట్లను పెట్టుకుని మరీ అప్పులు చేసింది. ఆ అప్పులు తెచ్చిన నిధులన్నీ ఏమయ్యాయో ఎవరికీ తెలియడం లేదు. ప్రభుత్వం ఆదాయం తగ్గిందంటూ ప్రతి పదిహేనురోజులకు ఓపన్ను పెంచుతోంది. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులను నాలుగు సార్లు పెంచారు. కరెంట్ చార్జీలు పెంచారు. చివరికి ఫైబర్ నెట్ చార్జీలు కూడా పెంచారు. దాదాపుగా.. ప్రతీ పన్ను పెంచారు. సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఇచ్చామని కబుర్లు చెబుతూ ఉంటారు. కానీ లెక్క చూస్తే ఎక్కడిచ్చారబ్బా అని అనుకోవడం తప్పదు. రైతు భరోసా పథకానికి ఓ రూ. ఆరు వేల కోట్లు.. అమ్మఒడికి మరో రూ. ఆరు వేల కోట్లు కేటాయించడమే భారీ పథకాలు. ఇంక అన్నీ చిన్నా చితకా పథకాలే. అతి కక్కువ లబ్దిదారులే. నియోజకవర్గానికి రెండు, మూడు వందల మంది ఉండటం కూడా గొప్పే. తక్కున నిధులు.. మహా అయితే.. రూ. 200 కోట్లతో మ..మ అనిపించే పథకాలు అమలు చేశారు. అదే సమయంలో.., ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క అభివృద్ధి పనీ జరగడం లేదు. మరి అప్పులేమయ్యాయి..?
సాక్షి ప్రకటనలకు, సలహాదారులకు… ప్రత్యేక విమానాల నిధుల లోటు ఉండదా !?
ఏపీ ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకు ఓ సలహాదారుడ్ని నియమించుకుంటుంది. రాజకీయ అవసరాల కోసం చేర్చుకున్న మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్…. ఏదో ఓ పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతో చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డికి సలహాదారు పదవులు ఇచ్చింది. ఒక్కొక్కరికి నాలుగైదు లక్షలకు తక్కువ జీతభత్యాలు ఉండవు. ఇలాంటి నియామకాలు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి జరుగుతూనే ఉన్నాయి. సాక్షి పత్రికకు .. నెలకు సరిపడా ఖర్చులన్నీ ప్రభుత్వం నుంచే ఠంచన్‌గా ప్రకటనల రూపంలో ప్రభుత్వం నుంచి పోతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాక్షి నుంచి ఇరవై శాతం మంది ఉద్యోగుల్ని గవర్నమెంట్ పేరోల్స్లోకి తెచ్చారు. ఇలా దుబారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాడేపల్లి నుంచి గుంటూరుకు హెలికాఫ్టర్‌లో వెళ్లేంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. మరి ఇంకా బీద అరుపులు ఎందుకు ?
ప్రభుత్వంపై ఎవరికీ నమ్మకం లేకుండా చేసి ఏం సాధించినట్లు !?
ఏపీ ప్రభుత్వంపై ఇప్పుడు ఎవరు నమ్మకం పెట్టుకున్నారు..? ఉద్యోగులు పూర్తిగా కోల్పోయారు. వారికి సినిమా అర్థమైపోయింది. కాంట్రాక్టర్లు .. బకాయిలు ఇస్తే చాలు.. ఉన్నదేదో తిని బతికేస్తామంటున్నారు. పనులు చేయడానికి ఎవరూ టెండర్లు కూడా వేయడం లేదు. అంతకు ముందు ప్రభుత్వ పనులంటే పరుగులు పెట్టి వచ్చేవాళ్లు. ఇప్పుడు సొంత పార్టీ వాళ్లు కూడా టెండర్లు వేయమంటే నమస్కారం పెడుతున్నారు. అంత నమ్మకం ఏర్పడింది. ఓటీఎస్… ఓటీసీ.. ప్లాన్లు.. క్రమబద్దీకరణలు అని వసూలు చేస్తున్న డబ్బులతో పేదలకు కూడా మండిపోతోంది. సినిమా వాళ్లకూ నమ్మకం లేదు. ఆస్పత్రులు.. స్కూళ్లు.. ఇలా ఎవరు చూసుకున్నా.. ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. చివరికి ఓ సెంటు భూమి ఇచ్చి.. పేదలను ఐదు లక్షల అప్పుల పాలు చేసి ఇల్లు కట్టుకోమని వేధిస్తున్నారంటే.. ఏమనుకోవాలి ? . ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్న ఒక్క వర్గమైనా ఉంటే.. ఆ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.
కూల్చడం ఈజీ.. కట్టడం కష్టం..! ఇప్పుడు ఏపీ విషయంలో అదీ సాధ్యం కాదు !/span>
సీఎం జగన్ మొదటి మీటింగ్‌లో అమరావతిలోని ప్రజావేదికలో కూర్చుని ఈ బిల్డింగ్‌ను కూల్చేస్తున్నాం అని చెప్పినప్పుడు ఎదురుగా కూర్చున్న అధికారుల్లో చాలా మంది చప్పట్లు కొట్టారు. అప్పుడే ప్రజలకు రాష్ట్ర భవిష్యత్ అర్థమైపోయింది. కూల్చడం ఈజీనే.. కట్టడమే కష్టం. అదే కూల్చే మైండ్ సెట్ ఉన్న వాళ్లకి అసలు సాధ్యం కాదు. అంతా నాశనం చేసేసుకుని.. అలా అయిపోయింది నేనేం చేయను అని చేతులెత్తేసేవాళ్లకి అసలు సాధ్యం కాదు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ముందు ముందు ఈ రెండున్నరేళ్ల పరిణామాలు ఇంకా ఎక్కువ అనుభవించాల్సి ఉంటుంది. ఓటు ఎంత విలువైనతో ప్రజలకు అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటుంది.