కత్తి మహేష్… ప్రతీరోజూ ఒక వివాదాస్పద అంశంతో వార్తల్లో ఉంటున్నారు! అలా అనే కంటే.. ఆయన్ని వార్తల్లో వ్యక్తిని చేస్తూ, కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని మరీ చర్చలు పెడుతున్నాయని అనుకోవచ్చు. ముఖ్యంగా టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వంటి ఛానెల్స్ అయితే అవసరానికి మించిన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి అనొచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఆయనేదో వివాదాస్పద వ్యాఖ్య చేయడమే ఆలస్యం… కత్తి మహేష్ లైవ్ షో షురూ! ఆ ప్రోగ్రామ్ కి కొంతమంది ఫోన్లు చేయడం, అక్కడి నుంచి బోలెడు శబ్ధ కాలుష్యం మొదలు! సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిన కత్తి నిన్నంతా వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. తీరా సాయంత్రం అయ్యేసరికి.. ఏబీఎన్ లో నటుడు వేణుమాధవ్ తో ఫోన్ లైన్లో మాట్లాడుతూ… తాను ప్రెస్ మీట్ పెడుతున్నట్టు చెప్పలేదనీ, ప్రెస్ క్లబ్ లో కాసేపు కూర్చుని ఏదో మాట్లాడదామని అనుకుంటే అక్కడికి మీడియా ప్రతినిధులు వచ్చేశారన్నారు. అంటే, పిలవని పేరంటానికి మీడియా అంతా పొలోమని వెళ్లిపోయిందన్నమాట..! అలాంటి పిలిచి చర్చలు పెట్టాల్సిన అవసరం వారికేమొచ్చిందీ..?
ఇంతకీ, కత్తి కామెంట్ల వెనక మీడియా పరుగులు తీయాల్సిన అవసరం ఏముంది..? ఆయనేదో దేశాన్ని ఉద్ధించే అంశాలు వెలుగులోకి తీసుకుని రావడం లేదు. పోనీ, సామాన్య ప్రజలకు మేలు జరిగే విషయాలపై స్పందించడం లేదు. కేవలం తన వ్యక్తిగత పాపులారిటీని పెంచుకోవడం కోసం, వార్తల్లో వ్యక్తిగా చలామణి కావడం కోసమే ఇంత చర్చ చేస్తున్నారనే విమర్శలు చాలా వినిపిస్తున్నాయి. దీన్ని పెట్టుబడిగా మార్చుకుని సొంత యూట్యూబ్ ఛానెల్స్ లాంటివి ప్రారంభించుకుంటున్నారనే విమర్శ కూడా ఉంది! సరే, ఇవన్నీ పక్కనబెడితే.. కత్తి మహేష్ వెనక కొన్ని ఛానెళ్ల వెంపర్లాట అంతిమ లక్ష్యం ఏంటీ..? ట్రెండింగ్ పేరుతోనో, టీఆర్పీ వస్తోందన్న లెక్కతోనే ఇలాంటి అంశాలను రాజేసుకుంటే పోతే చివరికి ఏం జరుగుతుంది..? ఇలానే అత్సుత్సాహానికి పోయి తలబొప్పి కట్టిన గతానుభవాలను ఈ సందర్భంలో సదరు మీడియా సంస్థలు గుర్తు చేసుకోకపోతే ఎలా..? తెలంగాణ ఉద్యమ విషయంలో ప్రదర్శించిన అత్యుత్సాహానికి చెల్లించుకున్న మూల్యాన్ని మరిచిపోతే ఎలా..?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొన్ని కోట్లమంది ప్రజల ఆకాంక్ష అనడంలో సందేహం లేదు. అయితే, ఈ అంశాన్ని ఒక ‘హాట్ టాపిక్’గా మాత్రమే కొన్నాళ్లపాటు ఓ ఛానెల్ చూసింది. దాని ద్వారా టీఆర్పీ రాబట్టుకోవాలన్న ఒకేఒక్క లక్ష్యంతో ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా ఉండేట్టు రకరకాల చర్చలూ కార్యక్రమాలు సదరు ఛానెల్ డిజైన్ చేసి ప్రసారం చేసింది. ఈ క్రమంలో కొంతమందికి స్థాయికి మించిన పబ్లిసిటీ ఇచ్చేసింది. ఇంత చేశాక చివరికి ఏమైంది..? తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో తొలిసారిగా ఆ ఛానెల్ ను బ్యాన్ చేశారు! టీఆర్పీ అనే తాత్కాలిక ప్రయోజనంతో ఒక అంశంపై అతిగా స్పందిస్తూ పోతే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో అనడానికి ఇదో ఉదాహరణ. తెలంగాణ ఉద్యమాన్ని రిప్రెజెంట్ చేయడమే ఆ ఛానెల్ చేసిన తప్పు అని చెప్పడం లేదు! ఆ సమయంలో ప్రజల ఆకాంక్షకు మించి, కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తే పరిణామాలు ఇలానే ఉంటాయని చెప్పడం కోసమే ఈ ప్రస్థావన.
కత్తి మహేష్ విషయంలో ఆ రెండు టీవీ ఛానెల్స్ అదే తప్పు మళ్లీమళ్లీ చేస్తున్నాయి. టీఆర్పీ ముసుగులో ఆయన ఇమేజ్ ను అప్రయత్నంగానే పెంచుతున్నాయి. కొన్నాళ్లు గడిచాక…ఇదే కత్తి మహేష్ ఇప్పుడు ప్రచారం ఇస్తున్న ఇవే ఛానెల్స్ పై రివర్స్ అయ్యే అవకాశం ఉండొచ్చు! ఆయన మాటల్లో ‘పవన్ కల్యాణ్’ అనే కీ వర్డ్ తీసేస్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పండీ! కాబట్టి, ప్రింట్ మీడియాలో అయితే కత్తి మహేష్ వార్తకి లోపలి పేజీల్లో సింగిల్ కాలమ్ స్పేస్ చాలు. టీవీ ఛానెల్స్ లో రీజినల్ బులిటెన్ లో ఒక నిమిషం నిడివి విజువల్ చాలు. అది కూడా ఆ ‘కీ వర్డ్’ కి ఇస్తున్న ప్రాధాన్యత మాత్రమే! అంతకుమించి స్పేస్ ఇవ్వడం అంటే… కత్తి మహేష్ కు ఉచిత పబ్లిసిటీ ఇవ్వడమే తప్ప, ఇతరులకు ఏమాత్రం ఉపయోగం లేని అంశం అవుతుంది. ఈ విషయాన్ని సదరు మీడియా సంస్థలు అర్థం చేసుకుంటాయో లేదో చూడాలి మరి..!