తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతారంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఆదివారం నిజం కాబోతోంది. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కేవలం 150 ఓట్ల ఆధిక్యంతో ఆత్రం సక్కు విజంయ సాధించారు. ఖమ్మం జిల్లా పినపాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేగ కాంతారావు విజయం సాధించారు. వీరిద్దరితో టీఆర్ఎస్ నేతలు కొంత కాలం నుంచి టచ్‌లో ఉన్నారు.
ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనుండటం, ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగించింది. ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు. అవసరం అయితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్లీ టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కేసీఆర్ ను కలిశారు. ఆయన కూడా పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ చేరికలతో మిత్రపక్షమైన ఎంఐఎం అభ్యర్థి గెలుపునకు కూడా ఢోకా లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి పరాజయం ఖాయమవుతుంది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి క్యాంప్‌కు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్న సమయంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఝులక్ ఇవ్వడంతో కాంగ్రెస్ డీలా పడిపోయింది.