తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల్లో ఉప దళితులను ఆకట్టుకునేందుకు పథకాలే కాదు రాజకీయ ప్రాధాన్యం కూడా కల్పించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఉపఎన్నికల తేదీ వచ్చిన తరవాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. అందులో ఇద్దరు దళిత నేతలకు మంత్రి పదవులు ఇవ్వనున్నారని.. వారిలో ఒకరికి డిప్యూటీ సీఎం కూడా ఇస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. మంత్రి వర్గ విస్తరణ అని పేరే కానీ.. అక్కడ కేబినెట్లో ఖాళీలు లేవు . ఇద్దర్ని భర్తీ చేయాలంటే ఇద్దర్ని తొలగించాలి. అందుకే టీఆర్ఎస్లో ఈ మంత్రి పదవుల భర్తీపై చర్చోపచర్చలు జరుగుకున్నాయి. దళిత ఓట్లను టార్గెట్గాపెట్టుకుని కేసీఆర్ ఇటీవలి కాలంలో చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక భారం అయినప్పటికీ దళిత బంధును ప్రవేశ పెట్టారు. అమలుకు సిద్ధమవుతున్నారు.
అయితే అది సరిపోదని వారికి రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలోకేసీఆర్ నినాదం … తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అనేది. అలా చేయకపోతే తన తలను నరుక్కుంటానని ఆయన అనేవారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని హైలెట్ చేసే అవకాశం ఉందని ఆయన అనుమానిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మాజీఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాధికారమే లక్ష్యమని ప్రకటిస్తూ పార్టీ పెట్టడంతో దళితులకు రాజ్యాధికారం అనే అంశం మరోసారి హాట్ టాపిక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఓ దళిత నేతకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి పరిస్థితిని వీలైనంత వరకూ చల్లబరుచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో తాటికొండ రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. తర్వాత ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయని బర్తరఫ్ చేశారు. కడియం శ్రీహరి ఎంపీగా ఉంటే రాజీనామా చేయించి.. ఎమ్మెల్సీ ఇచ్చి మరీ డిప్యూటీ సీఎంను చేశారు. రెండో సారి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఉపముఖ్యమంత్రి పదవి దళితులకు దక్కలేదు. ఇప్పుడు ఆ పదవిని భర్తి చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇద్దర్ని తొలగించి.. ఇద్దరికి చాన్సివ్వాలంటే కేసీఆర్ చాలా సమీకరణాలు చూసుకోవాల్సి ఉంటుంది. అసంతృప్తి రేగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనిపైనే కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.