జగన్ రెడ్డి సర్కార్ లో జీతాలు తగ్గిస్తే ఆహా.. ఓహో అని పొగుడుకోవాల్సిన దుస్థితికి వెళ్లిన ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అడగకుండానే డీఏలు మంజూరు చేస్తోంది. జగన్ రెడ్డి హయాంలో రెచ్చిపోయిన వారు ఇప్పుడు కనీసం తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు ధైర్యం చేయడం లేదు. జగన్ సర్కార్ తో వారు వ్యవహరించిన విధానం వల్ల మొత్తం క్యారెక్టర్ కోల్పోయారు. ఈ ప్రభుత్వాన్ని కనీసం విజ్ఞప్తి చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
అయినా ఉద్యోగుల నిస్సహాయతను ప్రభుత్వం అడ్వాంటేజ్ గా తీసుకోలేదు. సంక్రాంతి కానుకగా రెండు డీఏలు ప్రకటించాలని నిర్ణయించింది. గురువారం కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు రెండు డీఏలు ప్రకటించాలని నిర్ణయించారు. రెండు డీఏలు ప్రకటించడం వల్ల వారి జీతంలో మౌలికమైన మార్పు వస్తుంది. అలాగే పీఆర్సీపైనా, మధ్యంతర భృతిపైనా చర్చించాలని అనుకుంటున్నారు.
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ఇచ్చారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా విడిపోవడం వల్ల నష్టపోయామని అనుకోకుండా ఇంత పెద్ద మొత్తంలో హైక్ ఇచ్చారు. 2019లో ఎన్నికలకు వెళ్లే ముందు 23 శాతం మధ్యంతరభృతి ఇచ్చారు. కానీ ఉద్యోగ సంఘం నేతల కక్కుర్తి వల్ల మొత్తం నాశనం అయిపోయింది. జగన్ రెడ్డి డీఏలు ఇవ్వకపోగా.. చంద్రబాబు ఇచ్చిన ఐఆర్ ను కూడా తగ్గించి ఇరవై శాతమే పీఆర్సీ ఖరారు చేశారు. దీంతో ఉద్యోగులకు జీతం తగ్గిపోయింది.
ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సిన వాటిని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పీఆర్సీ, ఐఆర్ పై మళ్లీ దృష్టి సారించింది. ఉద్యోగులు ఇదే సందనుకునే గొంతెమ్మ కోరికలు కోరితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనల్ని పక్కన పడేసే అవకాశం ఉంది.