ఇది వరకు దర్శకుడు వేరు. రచయిత వేరు. ఇప్పుడు అలా కాదు. దర్శకులే రచయితలు. రచయితలే దర్శకులు. కాబట్టి సెట్లో రైటర్ ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకవేళ ఓ దర్శకుడు వేరే రచయితతో పని చేయించుకున్నా – సెట్లో రచయిత పాత్ర నామమాత్రమే. ఓ సినిమాకి దర్శకుడు వేరు.. రచయిత వేరై… రచయిత కూడా దర్శకుడ్ని మించిన స్టార్ అయితే – ఆ సందర్భం చాలా అరుదు. ఇప్పుడు అలాంటి సందర్భమే- పవన్ కల్యాణ్ సినిమా సెట్స్‌లో కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ – రానా కథానాయకులుగా `అప్పయ్యయున్ కోషియమ్` రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ రచయిత. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాకుండా, మూల కథలో కీలకమైన మార్పులు చేశారు. ఇప్పుడు ఆయన కూడా సెట్లోనే ఉంటున్నారు. ఇటీవల మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. సాగర్ చంద్ర కంటే ఎక్కువగా త్రివిక్రమ్ నే కనిపించాడు సెట్లో. సాగర్ చంద్ర కంటే.. త్రివిక్రమ్ రేంజ్ పెద్దది. ఇద్దరికీ పోలిక లేదు. ఈ సినిమా ని సెట్ చేసింది, సాగర్ చంద్రని దర్శకుడి కుర్చీలో కూర్చోబెట్టింది త్రివిక్రమ్ నే. కాబట్టి.. సెట్లో ఎవరి హవా ఎక్కువగా ఉంటుందో అర్థం చేసుకోవొచ్చు. పైగా పవన్ అంతటోడే.. `నేనున్నప్పుడు నాతో పాటుగా త్రివిక్రమ్ కూడా సెట్స్‌లో ఉండాలి` అని అల్టిమేట్టం జారీ చేశాడట. అలాంటప్పుడు త్రివిక్రమ్ ప్రభావం ఇంకెంత ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలా.. ఈ సినిమాలో సాగర్ చంద్ర పాత్ర కేవలం నామమాత్రమైపోతుందేమో అనిపిస్తోంది. అలాగైనా ఫర్వాలేదు. త్రివిక్రమ్ ఒకటి ఆలోచించి, సాగర్ చంద్ర మరోలా ఆలోచించి, చివరికి పవన్ కల్యాణ్ ఇంకోలా అనుకుంటే మాత్రం ఈ రీమేక్ వంటకం తేడా కొట్టేస్తుంది. ఆ ప్రమాదం ముంచుకు రాకుండా చూసుకుంటే మంచిది.