డిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై సిబిఐ అధికారులు దాడులు చేయడంతో మళ్ళీ డిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య సరికొత్త యుద్ధం మొదలయింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. తనను రాజకీయంగా ఎదుర్కోనలేకనే మోడీ ఈవిధంగా తనను వేధిస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మోడీ ఒక పిరికిపంద, మానసిక రోగి అని విమర్శించారు.
ఆయన విమర్శలను ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దానికి అరవింద్ కేజ్రీవాల్ ఇంకా ఘాటుగా జవాబిచ్చారు. డి.డి.సి.ఎ. కుంభకోణంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నిందితుడుగా ఉన్నందున దానికి సంబంధించిన ఫైళ్ళను పట్టుకుపోయేందుకే సిబిఐ అధికారులు తన కార్యాలయంలో శోదాలు నిర్వహించారని ఆరోపించారు. కానీ వాళ్ళు తన కార్యాలయంలో ఆ ఫైళ్ళను పరిశీస్తున్న సంగతి తెలియగానే తాను మీడియా సమావేశం పెట్టి తన కార్యాలయంపై సిబిఐ దాడుల గురించి మాట్లాడటం మొదలుపెట్టేసరికి వాళ్ళు హడావుడిగా రాజేంద్ర కుమార్ కార్యాలయానికి వెళ్లి అక్కడ తమ చేతికి దొరికిన కొన్ని కాగితాలను పట్టుకొని వెళ్లిపోయారని ఆరోపించారు. సిబిఐ అధికారులు పట్టుకువెళ్ళిన కాగితాలు తమ కార్యాలయంలో స్టేషనరీ సామాను కొనుగోలు కోసం వ్రాసిన ఇండెంట్ (అభ్యర్ధన) కాగితాలని, వాటికి ఈ కేసుతో ఎటువంటి సంబంధములేదని అన్నారు. సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకొన్న ఆ కాగితాల కాపీలను కేజ్రీవాల్ మీడియాకు విడుదల చేసారు.
డి.డి.సి.ఎ. కుంభకోణంలో అరుణ్ జైట్లీ ఎటువంటి తప్పు చేయకపోతే, తను లేని సమయంలో తన కార్యాలయంపైకి సిబిఐ అధికారులను పంపించి ఆ కాగితాల కోసం ఎందుకు వెతికించారని ప్రశ్నించారు.
కేజ్రీవాల్ చేసిన ఈ ఆరోపణలను అరుణ్ జైట్లీ అర్ధరహితమయినవని కొట్టిపడేశారు. సీబీఐ అధికారులు ఆయన ఆరోపణలను ఖండించారు. తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలోనే శోదాలు జరిపాము తప్ప ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ప్రవేశించలేదని చెప్పారు. రాజేంద్ర కుమార్ ఒక ప్రైవేట్ సంస్థకు సుమారు రూ. 9 కోట్లు లబ్ది కలిగే విధంగా నిర్ణయాలు తీసుకొన్నారని, దానికి సంబంధించిన ఫైళ్ళ కోసమే ఆయన కార్యాలయంలో శోదాలు నిర్వహించామని తెలిపారు.
ఈ వ్యవహారంలో బీజేపీ నేత శత్రుఘన్ సిన్హా కూడా మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. “రాజకీయాలలో టైమింగ్ చాలా కీలకమయినది. కేజ్రీవాల్ కార్యాలయంపై సిబిఐ దాడులు చేయడానికి ఇది సమయం కాదు. అసలు ఆయన కార్యాలయంపై దాడులు చేయమని ఎవరు సలహా ఇచ్చేరో తెలియదు. దీని వలన మళ్ళీ మనమే (మోడీ ప్రభుత్వమే) దెబ్బ తినదని ఆశిస్తున్నాను,” అని ట్వీటర్ లో మెసేజ్ పెట్టారు.
శత్రుఘన్ సిన్హా మాటలు నూటికి నూరుపాళ్ళు నిజమని భావించవచ్చును. సిబిఐ అధికారులు చేసిన దాడుల వలన దేశ వ్యాప్తంగా కేజ్రీవాల్ ప్రభుత్వం పట్ల ప్రజలకు సానుభూతి కలిగింది. ఒక ముఖ్యమంత్రి కార్యాలయంపై సిబిఐ అధికారులు దాడులు చేయడం చాలా అరుదయిన విషయమే. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి సూచనప్రాయంగానయినా తెలియజేయకుండా సీబీఐ అధికారులు ఆయన కార్యాలయంపై దాడులు నిర్వహించడాన్ని ప్రజలు కూడా హర్షించలేకపోతున్నారు. ఇదివరకు యూపీఏ ప్రభుత్వంలాగే ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా తన రాజకీయ శత్రువులపై సిబిఐని ప్రయోగించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయం కలిగేందుకు ఈ దాడులు దోహదపడుతున్నాయి. ఒకవేళ రాజేంద్ర కుమార్ అవినీతికి పాల్పడినట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నట్లయితే, అదే విషయం కేజ్రీవాల్ కి తెలియజేసి, ఆయన అనుమతితోనే శోదాలు నిర్వహించి ఉండి ఉంటే ఇటువంటి అపోహలు, అనుమానాలు కలిగి ఉండేవి కావు. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు మళ్ళీ కేజ్రీవాల్ పై ఎదురుదాడి చేయడం వలన మోడీ ప్రభుత్వం మరింత చెడ్డపేరు మూటగట్టుకొంటోంది.