`పుష్ష` తరవాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏమిటి? ఎవరితో? అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. పుష్ష తరవాత.. `ఐకాన్` అని తేలిపోయింది. వేణు శ్రీరామ్ ఈ కథ పట్టుకుని ఎన్నాళ్ల నుంచో తిరుగుతున్నాడు. ఎట్టకేలకు తనకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. `పుష్ష` పార్ట్ 1 అవ్వగానే ఐకాన్ మొదలైపోతుంది. ఈలోగా… లాంఛనంగా మొదలెట్టి, పూజా కార్యక్రమాల్ని నిర్వహించాలని కూడా చూస్తున్నారు. నిజానికి `ఐకాన్` ఓ ప్రయోగాత్మక సినిమా. అప్పట్లో బన్నీ ఈ కథ చేయడానికి ధైర్యం చేయకపోవడానికి కారణం అదే. అయితే ఇప్పుడు బన్నీ కోసం కొన్ని కమర్షియల్ టచింగులు ఇస్తున్నారు. పాన్ ఇండియా సినిమాకి కావల్సిన బలాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు హీరోయిన్లకు చోటు కల్పించినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరూ స్టార్ హీరోయిన్లే కనిపిస్తారని సమాచారం. బన్నీ కోసం బాలీవుడ్ హీరోయిన్లని రంగంలోకి దింపాలని చిత్రబృందం భావిస్తోంది. కుదరని పక్షంలో.. టాలీవుడ్ లోనే లీడ్ లో ఉన్న ఇద్దరు హీరోయిన్లని ఎంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే హీరోయిన్ల వేట మొదలెట్టేశారని టాక్. రష్మిక, పూజా హెగ్డే, సమంత లాంటి హీరోయిన్లు ఇది వరకే బన్నీతో నటించారు. వాళ్లెవరూ కాకుండా ఫ్రెష్ కాంబోలను తీసుకురావాలన్నది చిత్రబృందం ఆలోచన. మరి.. బన్నీకి జోడీగా ఎవరు సెట్టవుతారో చూడాలి.