ఇప్పుడు దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణా ప్రధమ స్థానంలో ఉందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ముంజేతి కంకణం చూసుకొనేందుకు అద్దం ఎందుకన్నట్లు ఈ ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో అభివృది వేగం పుంజుకోవడం ప్రత్యక్షంగా కళ్ళకి కనిపిస్తుంటే దానికి మళ్ళీ సర్వేలవసరమే లేదు. తెలంగాణా ప్రభుత్వం పట్టుదల కారణంగానే అది సాధ్యం అవుతోందని చెప్పకతప్పదు. కేంద్రప్రభుత్వం కూడా రాష్ట్రాభివృద్ధి కోసం యధాశక్తిన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. అయితే రాజకీయ కారణాల చేత తెరాస దానిని అంగీకరించడం లేనట్లు కనిపిస్తోంది.
తాజాగా తెలంగాణా రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రెండు పారిశ్రామిక కారిడార్స్ ని మంజూరు చేసింది. వాటిలో ఒకటి వరంగల్-హైదరాబాద్ మద్యన ఏర్పాటు అవుతుంది. మరొకటి హైదరాబాద్-నాగపూర్ మద్యన ఏర్పాటవుతుంది. హైదరాబాద్, నాగపూర్ నగరాలు ఇప్పటికే పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందాయి. వరంగల్ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు ఈ మూడు నగరాలని కలుపుతూ వాటి మద్యనున్న ప్రాంతాలలో కూడా పారిశ్రామిక అభివృద్ధి చెందినట్లయితే, దేశంలో తెలంగాణా రాష్ట్రం పారిశ్రామిక రంగంలో కూడా అగ్రస్థానంలో నిలుస్తుంది.