కర్ణాటకలో ఇప్పుడు ఉత్తర కర్ణాటక ఉద్యమం నడుస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి రైట్ హ్యాండ్ లాంటి బీజేపీ నేత బి.శ్రీరాములు ఇప్పుడీ ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి పెద్ద పార్టీగా అవతరించినా అధికారం దక్కకపోవడంతో.. ఆ పార్టీ నేతలు… నిరాశకు గురయ్యారు. అదే సమయంలో.. పార్లమెంట్ ఎన్నికల్లో … కాంగ్రెస్ – జేడీఎస్ కలసి పోటీ చేస్తే.. మొత్తానికే మోసం వస్తుందని డిసైడపోయారు. అందుకే.. ఇప్పుడు బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్‌ను పెంచుతున్నారు. పద్దతి ప్రకారం… ఉత్తర కర్ణాటకను… ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ అగ్రనేతలు.. పైకి తమ నేతల డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నా.. ఆ సెంటిమెంట్‌ను పెంచడానికి అంతర్గతంగా నిప్పు రాజేస్తూనే ఉన్నారు.
ఈ హడావుడిలోనే కర్ణాటకలో కొత్తగా మరో విభజన ఉద్యమం ఊపిరి పోసుకుటోంది. అదే రెండు జిల్లాలను ఏపీలో కలపాలనే డిమాండ్. ఆ రెండు జిల్లాలు కోలార్, చిక్ బళ్లాపూర్ జిల్లాలు. ఏపీకి సరిహద్దులో ఉండే ఈ రెండు జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. తాగు, సాగునీటి వసతి కూడా పెద్దగా లేదు. చిక్ బళ్లాపూర్కి హిందూపురం 50 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. నిన్నామొన్నటి వరకూ హిందూపురం, కోలార్, చిక్ బళ్లాపూర్కు పెద్దగా తేడా లేదు. విపరీతమైన నీటి కొరత ఉండేది. కానీ హిందూపురం పట్టణానికి ఇప్పుడు దాదాపుగా నీటి సమస్య తీరిపోయింది. రూ. 194 కోట్లతో ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి నీటిని తీసుకు వచ్చారు. హంద్రీనీవా మడకశిర బ్రాంచ్ కాలువ పనులు పూర్తి చేయించి నియోజకవర్గంలోని లేపాక్షి, హిందూపురం ప్రాంతాల్లో కొన్ని చెరువులు నింపారు. దీంతో కోలార్ , చిక్ బళ్లాపూర్ ప్రజల్లో కొత్త ఆలోచన ప్రారంభమైంది.
ఉత్తర కర్ణాటక ఉద్యమం పేరుతో.. తమను మరోసారి ఎండబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ రెండు జిల్లాల ప్రజలు భావిస్తున్నారు. దాంతో అక్కడి మేధావులు, ప్రజలు మెల్లగా ఏపీలో తమ జిల్లాలను కలపాలనే డిమాండ్ ను వినిపిస్తున్నారు. దీనికి అక్కడి మీడియా కూడా ప్రాధాన్యం కల్పిస్తోంది. కోలార్, చిక్ బళ్లాపూర్లలో.. తెలుగువాళ్ల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కొద్ది రోజుల కిందట జరిగిన ఎన్నికల్లో బీజేపీని పూర్తి స్థాయిలో తిరస్కరించారు. ఉత్తర కర్ణాటకపై ఎంత వేగంగా ఉద్యమం సాగుతుందో.. ఈ రెండు జిల్లాలను ఏపీలో కలపాలన్న ఉద్యమం కూడా అదే స్ధాయిలో పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.