జనసేన పార్టీ ట్రెజరర్‌గా చాలా కాలం పాటు కీలకంగా వ్యవహరించిన మారిశెట్టి రాఘవయ్య… రాజీనామా చేశారు. తాను జనసేన కార్యక్రమాల నుంచి విరమించుకుంటున్నానని ఆయన ప్రకటించారు. వాస్తవానికి ఆయన కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన రాజీనామా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగదని భావించి.. వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు.. పవన్ కల్యాణ్ వెంట అతి కొద్ది మందిలో రాఘవయ్య ఒకరు. పేరుకు పవన్ కల్యాణ్ అయినా… కొన్నాళ్ల వరకూ .. అన్నింటినీ రాఘవయ్యే నిర్వహించారు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ.. కొత్త నేతలు రావడంతో… ఆయనకు ప్రాధాన్యత తగ్గింది.
ఒకప్పుడు పీఆర్పీలోనూ… ఆతర్వాత జనసేన విషయంలోనూ.. చిరంజీవికి, పవన్ కల్యాణ్‌కు తోడుగా ఉన్నారు రాఘవయ్య. ఆయన వ్యవహారాలన్నీ తెర వెనుకే ఉంటాయి. ఎప్పుడూ మీడియా ముందుకు రావాలని.. తనకు పబ్లిసిటీ రావాలని అనుకోరు. జనసేన స్థాపించిన నాలుగున్నరేళ్ల పాటు.. జనసేనకు సంబంధించిన వ్యవహారాలన్నీ మారిశెట్టి రాఘవయ్యే చూసేవారు. పవన్ కల్యాణ్.. ఎక్కడైనా సభ పెట్టాలనుకుంటే… అక్కడ వాలిపోయి .. ఒకటి, రెండు రోజుల్లోనే ఏర్పాట్లు పూర్తి చేసేవారు. కొత్త నేతలు వచ్చిన తర్వాత … ఆయనకు పవన్ కల్యాణ్ ప్రాధాన్యం తగ్గించారు. కొంత మంది నేతలు.. రాఘవయ్య.. టిక్కెట్లు ఆశ చూపి డబ్బులు కూడా వసూలు చేశారని పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ కారణంగా.. ఓ సందర్భంలో పవన్ కల్యాణ్.. రాఘవయ్యపై టెంపర్ చూపించేశారని ప్రచారం జరిగింది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి రాఘవయ్య… పార్టీలో కీలకంగా వ్యవహరించడం మానేశారు. పవన్ కూడా పెద్దగా పట్టించుకోలేదు.
జనసేన పార్టీకి సంబంధించి ఇటీవలి కాలంలో.. చాలా మంది నేతలు దూరమయ్యారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి అంటి పెట్టుకున్న వారు కొందరు వెళ్లిపోగా.. మధ్యలో వచ్చిన వారు మరికొందరు వెళ్లిపోయారు. అధికార ప్రతినిధులుగా.. ఉన్న విజయ్ బాబు, అద్దేపల్లి శ్రీధర్ లు.. కూడా.. గుడ్ బై చెప్పారు. తమకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదనేది వారి వాదన. తాజాగా మారిశెట్టి రాఘవయ్య పేరు బయటకు వచ్చింది. ఫలితాలు రాక ముందే జనసేన పార్టీలో పరిస్థితి ఇలాంటే.. రేపు ఫలితాల తర్వాత.. ఇంకెలాంటి పరిస్థితులు వస్తాయోననే ఆందోళన జనసేన వర్గాల్లో వ్యక్తమవుతోంది.