జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ దూకుడు మీద ఉంది. ఇటీవల సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది ఇపపుడు మరో చార్జిషీట్లను దాఖలు చేసింది. ఈడీ.. ఇప్పటికే 7 చార్జీషీట్లను కోర్టుకు సమర్పించింది. వాటిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. తాజాగా వాన్పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులకు సంబంధించిన మరో 2 ఛార్జిషీట్లను కోర్టుకు సమర్పించింది. వీటిని కోర్టు పరిగణలోకి తీసుకుంటే నిందితులందరికీ నోటీసులు జారీ చేస్తుంది.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ ప్రాజెక్టును చేపట్టారు. గల్ఫ్ లోని ఓ చిన్న దేశం అయిన రస్ అల్ ఖైమా తో కలిసి నిమ్మగడ్డ ప్రసాద్ జాయింట్ వెంచర్ గా ప్రారంభించారు. దీనికి అప్పటి ప్రభుత్వం 24 వేల ఎకరాలు కేటాయించింది. అయితే ఈ కేటాయింపుల వెనుక క్విడ్ ప్రో కో ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేటాయింపుల తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టారని సీబీఐ కేసులు నమోదు చేసింది. దాదాపుగా రూ. 850 కోట్లను.. నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా పెట్టారు. వీటిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసుపై ఈడీ తాజాగా చార్జిషీట్ నమోదు చేసింది.
అనంతపురం లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం ప్రభుత్వం కేటాయించిన వేల ఎకరాల భూముల్ని కేటాయించింది. అక్కడ ఏమీ పనులు చేపట్టకపోగా ఆ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. అదే సమయంలో భూముల్ని కేటాయించినందుకు గాన క్విడ్ ప్రో కో తరహాలో జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. వీటిపైనా ఈడీ తాజాగా చార్జిషీట్లు దాఖలు చేసింది. నిందితులందరికీ నోటీసులు జారీ చేస్తే విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సీబీఐ కోర్టులో ఇక వాదనలు ప్రారంభించాలని పలు కేసుల్లో జగన్ తరపు న్యాయవాదులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.