కాంగ్రెస్ పార్టీ గెలవడం మర్చిపోయింది. దానికి ఓటమి అలవాటైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరీ బలహీనపడిపోయింది. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు సంధిస్తున్నారు. త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో ఓడిస్తామని వ్యాఖ్యానిస్తున్నారు. 2019 నాటికి కాంగ్రెస్ ఉనికి నామమాత్రం అవుతుందని సవాళ్లు విసురుతున్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ తమ లక్ష్యమని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. కాంగ్రెస్ తొలిసారిగా అత్యంత తక్కువగా, 44 సీట్లకు పరిమితమైంది.
ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మొదలయ్యే సమయానికే చాలా మంది కాంగ్రెస్ నేతలకు విషయం అర్థమైంది. ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా ఉండవని ఎగ్జిట్ పోల్స్ కుండ బద్దలు కొట్టేశాయి. అధికారంలో ఉన్న కేరళ, అస్సాం చేజారాయి. వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా బెంగాల్లో చేదు ఫలితాలే వచ్చాయి. డీఎంకేతో చేయి కలిపినా, తమిళనాడులో పరాజయం పలకరించింది. పుదుచ్చేరిలో అధికారంలోకి రావడం ఒక్కటే కాంగ్రెస్ కూటమికి ఊరట కలిగించే విషయం.
ఒకప్పుడు కాంగ్రెస్ అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తలపించేది. కేంద్రంలో, అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. పార్టీ అధినేతలు ఢిల్లీనుంచే చక్రం తిప్పే వారు. నచ్చని ముఖ్యమంత్రిని మార్చేసేవాళ్లు.
ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఆరుకు పడిపోయింది. అందులోనూ కర్ణాటక ఒక్కటే పెద్ద రాష్ట్రం. ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అనే చిన్న రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈశాన్యంలోని మిజోరం, మణిపూర్, మేఘాలయ అనే మరీ చిన్న రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి.
వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో, కాంగ్రెస్ ఇప్పుడు అతి తక్కువ మందిని పాలిస్తోంది. దేశ జనాభాలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వాటా 7.01 శాతం. అంటే, కేవలం 7.01 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ పాలనలో ఉన్నారు. ఈ స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడటం గతంలో ఎన్నడూ లేదు.
కాంగ్రెస్ పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. పరాజయాలూ కొత్త కాదు.
ఓడిన తర్వాత పడిలేచిన కెరటంలా బలం పుంజుకునేది. ఇందిర హయాంలో అదే జరిగింది. ఆ తర్వాత మాత్రం అంతటి సత్తా గల నాయకత్వం లేకుండా పోయింది. రాజీవ్ గాంధీ రెండోసారి కేంద్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురాలేక పోయారు. ఇప్పుడు సోనియా గాంధీ హయాంలో పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది.
2014 లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాయం తర్వాత కాంగ్రెస్ కోలుకోలేదు. సోనియా, రాహుల్ గాంధీలు మొదట తాము తేరుకుని, పార్టీ శ్రేణుల్లో స్థయిర్యాన్ని నింపలేకపోయారు. రాహుల్ గాంధీపై క్రమంగా నమ్మకం సడలుతోంది. ప్రియాంక రావాలనే డిమాండ్ పెరుగుతోంది. ఒక వ్యూహం, ఆత్మ విశ్వాసం, ప్రణాళిక వంటివి లేకపోతే ప్రియాకం వచ్చినా ఫలితం ఏముంటుంది?
ఇంతటి సంక్షోభం నుంచి బయటపడి బలపడటానికి రాహుల్ గాంధీ సరైన, సమర్థుడైన నాయకుడిగా ముందుకొస్తారో లేదో చూద్దాం.