సినిమా ప్రారంభోత్సవం అంటే.. ఓ పండగలాంటిదే. మంచి ముహూర్తం చూసుకుని, కొబ్బరికాయ కొడతారు. ఆ రోజున తొలి షాట్ తీసి శ్రీకారం చుడతారు. సాధారణంగా ఏ అన్నపూర్ణ స్టూడియోలోనో, రామానాయుడు స్టూడియోలోనో, లేదంటే అవుడ్డోర్లోనో క్లాప్కి రంగం సిద్ధం చేస్తారు. అ క్షణం నుంచి ఆ సినిమా పట్టాలెక్కినట్టే. అయితే… ఓ సినిమాకి ఒకేసారి, రెండు వేర్వేరు చోట్ల ముహూర్తం జరుపుకుంది. ఇది అరుదైన సంఘటనే.
ఆ విచిత్రం ‘శ్రీవారి ముచ్చట్లు’ సినిమాకి జరిగింది. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన చిత్రమిది. నాగేశ్వరరావు హీరో. జమ్మూ – కాశ్మీర్లోని శ్రీనగర్లో చిత్రీకరణ జరపాలని దాసరి నిర్ణయించారు. అక్కడే సినిమాకి తొలి క్లాప్ కొట్టాలని భావించారు. చిత్రబృందం రెండు టీమ్లుగా విడిపోయింది. మొదటి టీమ్ జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీనర్ వెళ్లింది. రెండో టీమ్.. జమ్మూ నుంచి శ్రీనగర్ బయల్దేరే సమయంలో చిన్న అపశ్రుతి. ట్రైన్ మిస్సవ్వడంతో.. చివరి క్షణాల్లో వాళ్ల ప్రయాణం ఆగిపోయింది. అయితే..కెమెరామెన్, కెమెరా, ఇతర కీలక సిబ్బంది జమ్మూలోనే ఉండిపోయారు. నటీనటులతో పాటుగా దాసరి శ్రీనగర్లో ఉన్నారు. చిత్ర నిర్మాత శ్రీనివాసరావుకి సెంటిమెంట్స్ ఎక్కువ. అనుకున్న సమయానికి ఎలాగైనా సరే షూటింగ్ మొదలవ్వాలి అనే సరికి… జమ్మూలో ఉండిపోయిన సహాయ దర్శకుడు రేలంగి నరసింహారావుకి దాసరి ఫోన్ చేశారు. ”నేను లేకపోయినా ఫర్వాలేదు. హీరో హీరోయిన్లు లేకపోయినా ఫర్వాలేదు. అనుకున్న సమయానికి తొలి షాట్ పడాలి. కెమెరా నీ దగ్గర ఉంది కాబట్టి… దేవుడి పటాలపై ముహూర్తపు షాట్ తీయ్” అని దాసరి ఆర్డరేశారు. దాంతో.. జమ్మూఅంతా తిరిగి ఓ శ్రీకృష్ణుడి పటం సంపాదించిన రేలంగి… గురువుగారి ఆజ్ఞ ప్రకారం తొలి షాట్ తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
అయితే నిర్మాత శ్రీనివాసరావుకి మాత్రం అది నచ్చలేదు. ”హీరో హీరోయిన్లు మన దగ్గర ఉన్నారు కదా… వీళ్లమీదే ఫస్ట్ షాట్ పడాలి కదా” అనేసరికి దాసరికి మరో ఆలోచన వచ్చింది. సరిగ్గా ముహూర్తం సమయానికి అక్కినేని, జయప్రదలకు మేకప్ వేసి… వాళ్లపై ఫొటో షూట్ చేశారు. అప్పటికే రేలంగి జమ్మూలో తొలి షాట్ తీసేశారు. అలా.. ఒకేరోజున ఒకే సినిమా రెండుసార్లు ముహూర్తం జరుపుకుంది. ఆ రోజు… 1980 ఆగస్టు 11.
1981 జనవరి 1న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని – దాసరి కాంబోలో మరో హిట్ గా నిలిచింది. ఈ విషయాలన్నీ ‘విశ్వవిజేత విజయగాథ’లో ప్రస్తావించారు ప్రముఖ సినీ జర్నలిస్టు వినాయకరావు.