తెలంగాణలో బీఆర్ఎస్ కీలక నేతల మెడకు చుట్టుకుంటుందని అందరూ ఊహిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులను పోలీసులు రద్దు చేయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు ప్రభుత్వం మారిన తర్వాత అమెరికా పరారయ్యారు. ఆరు నెలల వీసాపై వెళ్లిన ఆయన కేసు నమోదైన మొదట్లో తిరిగి వస్తానని సమాచారం ఇచ్చారు కానీ రాలేదు. ఆయన పై రెడ్ కార్నర్ నోటీసులతో పాటు తాజాగా పాస్ పోర్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఐ న్యూస్ చానల్ యజమానికి శ్రవణ్ రావు కూడా పారిపోయారు. ఆయన ఎక్కడికి పారిపోయారో తెలియదు కానీ.. ఆయన కూడా ఆమెరికాకే చేరుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యంత కీలక కేసులో పరారీలో ఉన్న వారు … అమెరికాలో తలదాచుకున్నారంటూ వీరిద్దరి పాస్ పోర్టులు రద్దు చేయాలని పాస్ పోర్ట్ ఆఫీస్ కు లేఖ రాశారు పోలీసులు. పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ రావు పాస్ పోర్టు రద్దు చేశారు.
పాస్ పోర్టు రద్దు అయితే వారు ఇక ఎక్కడికి పోలేరు. ఎక్కడైనా విమానం ఎక్కాలనుకుంటే వెంటనే అదుపులోకి తీసుకుంటారు. ఇండియాకు డిపోర్టు చేస్తారు. అయితే వారు ప్లాన్ బీలో ఉండి ఉంటారని.. అందుకే ధైర్యంగా బయటకు రావడం లేదని అంటున్నారు. ప్రభాకర్ రావు అమెరికా పారిపోవడంతో ఇతర నిందితులు జైల్లో మగ్గిపోతున్నారు. వారికి బెయిల్ కూడా రావడం లేదు. ప్రభాకర్ రావు వస్తే గత ప్రభుత్వ పెద్దల్ని అరెస్టు చేస్తారేమోనన్న ఆందోళన బీఆర్ఎస్ లో కనిపిస్తోంది, ఇప్పుడు వారి పాస్ పోర్టుల రద్దుతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.