తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామమోహనరావుల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా కౌన్సిలింగ్ చేసే స్ధాయికి తగాదా పెరుగుతోంది.
సుజనా చౌదరి పని తీరు వ్యవహారశైలి నరేంద్రమోదీకి ఏమాత్రం నచ్చడం లేదని, ఈ విషయం ప్రధాని కార్యాలయం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళిందనీ , రాజ్యసభ ఎన్నికల ముందు డిల్లీనుంచి మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. సమాచారసాధనాలకు దూరంగా వుండే సుజనా చౌదరి, నిరంతరం మీడియాతో సన్నిహితంగా వుండే రామమోహనరావు ఈ వార్తలకు కారకుడని గట్టిగా నమ్మారట!
రాజ్యసభ సభ్యునిగా సుజనాచౌదరి పదవీ కాలం, ఎపి ప్రభుత్వ ప్రతినిధిగా రామమోహనరావు పదవీకాలం ఇంచుమించు ఒకేసారి ముగిశాయి. రామమోహనరావు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించి గట్టిగానే లాబీచేశారు. ఇందులో భాగంగానే ఆయన తనకు వ్యతిరేకంగా మీడియాను హ్యాండిల్ చేశారన్నది సుజనాచౌదరి నమ్మకమని ఆయన మద్దతుదారులు అంటున్నారు.
సుజనా చౌదరి తిరిగి రాజ్యసభకు ఎన్నికవ్వడంతో మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. రామమోహన రావు పదవీకాలం ముగిసిపోయింది. ఆయన స్ధానంలో మరెవ్వరినీ రాష్ట్రప్రభుత్వం నియమించలేదు. ఈ స్ధితిలో ఆయన్ని తిరిగి ఆపదవిలో నియమించకూడదని సుజనా చౌదరి లాబీయింగ్ మొదలు పెట్టారు. రాజ్యసభ సభ్యునిగా రెండో సారి పొడిగింపుకు ముందు సుజనా చౌదరి ఎంత టెన్షన్ కీ, అసహనానికీ లోనయ్యారో…ఆయన పదవి స్ధిరపడ్డాక అంతే టెన్షన్ ని, అంతే అసహనాన్ని రామమోహనరావుకి ఇస్తున్నారు.
ఒకరు కష్టకాలంలో పార్టీని ఆదుకున్నవారు…మరొకరు పార్టీ పుట్టుకనుంచీ వేర్వేరు బాధ్యతలు నిర్వహిస్తున్నవారు. ఇద్దరూ సంపన్నమైన పలుకుబడి కలిగినవారే కావడంతో తెలుగుదేశం పార్టీకి దేశరాజధానిలో రెండు పవర్ సెంటర్లు తయారైనట్టయింది. డిల్లీ వెళ్ళే తెలుగుదేశం వారికి వీరిలో ఎవరిని ముందుకలవాలో ఎవరిని కలిస్తే ఎవరికి కోపమొస్తూందోనని ఇబ్బంది పడుతున్నారు.
ఈ విషయంలో తీవ్రత చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది…వారికి విడివిడిగా, కలిపి కూర్చోబెట్టీ కౌన్నిలించేయాలని ఆయన డిసైడ్ అయిపోయారట!