హైదరాబాద్ జంట నగరాలలో నానాటికీ పెరిగిపోతున్న ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి కొత్తగా మరో రెండు భారీ రైల్వే స్టేషన్లని నిర్మిస్తామని తెలంగాణా బడ్జెట్ పై శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అందుకు అవసరమయిన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పూర్తిచేస్తోంది. చర్లపల్లి మరియు వట్టి నాగులపల్లి వద్ద కొత్తగా రెండు భారీ రైల్వే స్టేషన్లు నిర్మించబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా చెప్పారు. వీటికి అవసరమయిన అనుమతులు కూడా మంజూరు అయినందున, రాష్ట్ర ప్రభుత్వం భూములు సమకూర్చగానే నిర్మాణ పనులు మొదలుపెడతామని తెలిపారు. చర్లపల్లిలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి 150 ఎకరాలు, నాగులపల్లిలో 300 ఎకరాలు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలిపారు. ఈ రెండు రైల్వే స్టేషన్ల నిర్మాణం ఈ ఏడాది చివరిలోగా మొదలుపెట్టినట్లయితే రెండేళ్ళలో నిర్మాణం పూర్తికావచ్చును. ప్రస్తుతం జంటనగరాలకు రైల్ మార్గం ద్వారా చేరుకోవాలంటే నాంపల్లి, సికిందరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. కనుక కొత్తగా ఈ రెండు రైల్వే స్టేషన్లు కూడా అందుబాటులోకి వస్తే ఆ మూడు స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. యాదాద్రి (యాదగిరి గుట్ట) వరకు మెట్రో రైల్ ప్రాజెక్టును పొడిగించే పనులు కూడా త్వరలో మొదలవుతాయని రవీంద్ర గుప్తా తెలిపారు. ఈ పనులు ఆర్.వి.ఎన్.ఎల్.సంస్థ చేపట్టబోతోందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం రెండు మూడేళ్ళసమయం పట్టవచ్చును. అది పూర్తయితే నల్గొండ వరకు అన్ని ప్రాంతాల ప్రజలు జంటనగరాలకు సులువుగా చేరుకొనే అవకాశం ఏర్పడుతుంది.