ఆర్.ఆర్.ఆర్‌లో పాటలు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తున్నాయి. ముఖ్యంగా `నాటు నాటు` బాగా పాపులర్ అయిపోయింది. ఎత్తర జెండా కూడా మాసీగానే అనిపించింది. థీమ్ సాంగ్ గా రూపొందిన `జననీ` ఎప్పుడో రిలీజ్ చేసేశారు. దోస్తీ.. రెండు పాత్రల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక. అయితే ఈ సినిమాలో మరో రెండు పాటలున్నాయి. వాటిని ఇప్పటి వరకూ రిలీజ్ చేయలేదు. ఇక చేయరు కూడా. నేరుగా థియేటర్లోనే చూసుకోవాల్సిన పాటలవి. రెండూ అలియా భట్ వే కావడం గమనించదగిన విషయం. అందులో ఒకటి అలియా సోలో గీతమని, మరోటి.. చరణ్‌తో డ్యూయెట్ అని తెలుస్తోంది.
ఈ రెండు పాటల్నీ రిలీజ్ చేసేంత టైమ్ రాజమౌళి టీమ్ కి ఉంది. కానీ.. రిలీజ్ చేయలేదు. దాంతో అలియా కాస్త అంతృప్తిగా ఉందని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ రెండో దఫా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నా, అలియా హాజరు కాలేదు. ఒక్క ఢిల్లీ ఈవెంట్ లోనే అలియా కనిపించింది. ఈ సందర్భంగా రాజమౌళిని `నా పాటలెందుకు రిలీజ్ చేయలేదు` అని అడిగేసిందట. అందులోనే ప్రశ్న, కంప్లైంట్ రెండూ ఉన్నాయి. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లను ఓ స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నాడు రాజమౌళి. ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలో, ఏ విషయాన్ని దాచాలో ఆయనకు బాగా తెలుసు. ఈ రెండు పాటల్ని బయటకు రాకుండా ఆపాడంటే, ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది.