మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మొదటి సగ భాగంలో అక్కడక్కడ కథనం మందగించడం, రెండవ సగంలో కమర్షియల్ హంగులు కొంత ఎక్కువగా ఉండడం వంటి విమర్శలు ఉన్నప్పటికీ, సినిమా లో ఉన్న రోమాంచిత సన్నివేశాలు, అద్భుతంగా వచ్చిన ఇంటర్వల్ బ్లాక్, పతాక సన్నివేశంలో చిరంజీవి అద్భుత నటన సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయని పబ్లిక్ టాక్ వస్తోంది. అయితే సరిగ్గా విడుదలకు ముందు చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలోని పాటల విషయం లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలో ప్రస్తుతానికి కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. అయితే సినిమా విడుదలకు ముందు రోజు చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మొత్తంగా నాలుగు పాటలను ఈ సినిమా కోసం తీసినప్పటికీ, కథా గమనానికి అడ్డు పడకుండా ఉండటం కోసం సినిమాలో ప్రస్తుతం కేవలం పాటలు మాత్రమే ఉంచినట్లు, ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే (బహుశా ఆయన ఉద్దేశం సినిమా పెద్ద హిట్ అయితే) మిగిలిన ఆ రెండు పాటలను కూడా వీలునుబట్టి సినిమాలో కలుపుతామని చిరంజీవి వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పుడు, సినిమా పెద్ద హిట్ కావడంతో, కొద్ది రోజుల తర్వాత, అంటే సినిమా రన్ దాదాపు పూర్తయింది అనిపించే సమయానికి ఇందులో ఒక పాటని కానీ లేదా రెండు పాటలను కానీ కలుపుతారేమో వేచి చూడాలి. గతంలో చూడాలని ఉంది సినిమా సమయంలో కూడా ఇలాగే చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే.